Mudragada: ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక రాజకీయాల్లోకి కాపు ఉద్యమ నేత
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో చాలామంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వైసీపీ,టీడీపీలో ఇప్పటికే వలసలు మొదలయ్యాయి. కాపు రిజర్వేషన్లపై కాపు ఉద్యమనేత,సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో తన గళంవినిపిస్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం జనసేన ద్వారా కాకినాడ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాపులపై పవన్ కళ్యాణ్ ఇటీవలి వైఖరికి మద్దతు తెలిపిన ఆయన కాపు రిజర్వేషన్ల కోసం ఇటీవల జరిగిన నిరసనలతో తగినంత మైలేజ్ సంపాదించారు. ముద్రగడ తన రాజకీయ భవిష్యత్తుపై తన సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తో కలిసి నడవాలని ఆయన సన్నిహితులంతా కోరుకుంటున్నారు.
ముద్రగడ ఇంటికి బొలిశెట్టి,జ్యోతుల నెహ్రూ
ఈ నేపథ్యంలో బుధవారం ముద్రగడతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ చర్చలు జరిపారు. జనసేన నేతలతో భేటీపై ముద్రగడ పద్మనాభం మౌనం వహించినా మరికొద్ది రోజుల్లో జనసేన అధినేత స్వయంగా ముద్రగడ ఇంటికి వచ్చి జేఎస్పీ-టీడీపీ కూటమిలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. గురువారం ఉదయం ముద్రగడ ఇంటికి టీడీపీ సీనియర్ నేత టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వచ్చి చర్చలు జరిపారని, తమ పార్టీలో చేరాల్సిందిగా ఆయనను అధికారికంగా ఆహ్వానించారని కొత్త కథనాలు చెబుతున్నాయి.
ముద్రగడ కుమారుడు గిరిబాబు క్లారిటీ
ముద్రగడ భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీలో చేరతారనే దానిపై ముద్రగడ కుటుంబం క్లారిటీ ఇవ్వలేదు. ఈ తరుణంలో ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి బాబు పద్మనాభం టీడీపీ, జనసేన ఏ పార్టీలోకి అయినా వెళ్లే అవకాశం ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. తండ్రితో పాటు తాను కూడా పోటీ చేస్తానని చెపారు. జనసేన, టీడీపీల్లో చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే దానిపై ముద్రగడ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.