
Mumbai Rains: ముంబైకి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్.. 17 లోకల్ రైలు సర్వీసుల రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాష్ట్రాన్ని వరదల ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరం కుండపోత వర్షాలతో అతలాకుతలం అవుతోంది. రాత్రింబగళ్లు కురుస్తున్న భారీవర్షాల దెబ్బకు జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాలు నీటమునిగిపోవడంతో రవాణా వ్యవస్థ సరిగా పని చేయలేని స్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ)ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్ర వర్షపాతం కారణంగా నగర రవాణా రంగం సతమతమవుతోంది. ముంబయి జీవనాడిగా పేరుగాంచిన లోకల్ రైళ్ల రాకపోకలకు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. రైల్వే పట్టాలు నీటమునిగిపోవడంతో సెంట్రల్ రైల్వే ఒకేసారి 17 లోకల్ రైలు సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా,విమాన సర్వీసులపై కూడా వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది.
వివరాలు
థానే,నవీ ముంబయి,లోనావాలాలో పాఠశాలలకు సెలవులు
ఇండిగో, స్పైస్ జెట్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ సూచనలు విడుదల చేశాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు ఆలస్యమయ్యే లేదా రద్దయ్యే అవకాశం ఉందని, అందువల్ల ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు ప్రయాణికులు తమ విమాన స్థితి తప్పనిసరిగా పరిశీలించాలని హెచ్చరించాయి. మరోవైపు,నగరంలోని అనేక ప్రధాన రహదారులు వరద ప్రవాహంలా మారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని థానే,నవీ ముంబయి,లోనావాలా ప్రాంతాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలు కూడా పరిమిత స్థాయిలో మాత్రమే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అంతేకాకుండా, భద్రతా కారణాల వల్ల బాంబే హైకోర్టు కూడా మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకే కార్యకలాపాలను నిలిపివేసింది.
వివరాలు
గురువారం నుంచి వర్షాల తీవ్రత తగ్గే అవకాశం
అయితే, గురువారం నుంచి వర్షాల తీవ్రత తగ్గుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు పునరుద్ఘాటిస్తున్నారు.