Chandrababu Arrest: అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ పై నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆయన సతీమణి, నారా భువనేశ్వరి నిరహార దీక్ష చేయనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఈ దీక్ష ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటికే చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజలు బాధపడుతున్నారన్నారు. తెలుగుదేశం అధినేత అరెస్టును జీర్ణించుకోలేక 97 మంది మరణించారని ఆయన చెప్పారు. నంద్యాలలో తెదేపా పొలిటికల్ యాక్షన్ కమిటీ నేడు సమావేశమైంది. ప్రాణాలు కోల్పోయిన 97 మంది పట్ల కమిటీ సంతాపం ప్రకటించింది. ఈ క్రమంలోనే కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం పార్టీ భవిష్యత్ కార్యాచరణను అచ్చెనాయుడు ప్రకటించారు.
అక్టోబరు 2న ప్రతి ఇంట్లో లైట్లు ఆపేసి నిరసన తెలపాలి
చనిపోయిన కుటుంబీకులను కలిసి ధైర్యం చెప్పి, వారిలో భరోసా నింపనున్నట్లు వివరించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లు ఆపేసి ప్రజలు స్వచ్ఛందంగా నిరసన తెలియజేయాలని సూచించారు. ఈ మేరకు లైట్లు ఆపేసి నివాసం బయట కొవ్వొత్తులతో నిరసన తెలపాలన్నారు. ఇక ఏపీలో జనసేన - టీడీపీ జేఏసీ వేయాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే తెలుగుదేశం, జనసేన నుంచి కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. ఇప్పటికే కలిసి పనిచేస్తున్నట్లు చెప్పిన అచ్చెన్న, వచ్చే 4 రోజులు మచిలీపట్నం పరిధిలో పవన్ పర్యటిస్తారన్నారు.