Hindi language row: ప్రధానిమోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ.. స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం ఎటువంటి భాషను బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
విదేశీ భాషలపై అధికంగా ఆధారపడటం వల్ల విద్యార్థులు స్థానిక భాషల మూలాలను పూర్తిగా అర్థం చేసుకోలేరని అన్నారు.
జాతీయ విద్యా విధానం(NEP)ద్వారా ఈ పరిస్థితిని సరిచేసే ప్రయత్నం కొనసాగుతోందని మంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గతంలో తమిళ భాష శాశ్వతమని చేసిన ప్రకటనను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, తమిళ సంస్కృతి, భాషను విశ్వవ్యాప్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
విద్యను రాజకీయాలకు వేదికగా మార్చకూడదని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
రూ.2,152 కోట్లను తక్షణమే విడుదల చేయాలి: స్టాలిన్
సమగ్ర శిక్షా పథకం కింద తమిళనాడుకు రూ.2,152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
జాతీయ విద్యా విధానం-2020ను పూర్తిగా అమలు చేయకపోతే,త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు ఈ నిధులను ఇవ్వబోమని ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రకటించారని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.
ఈ నిర్ణయం రాష్ట్రంలోని విద్యార్థులు,ప్రజలు,రాజకీయ పార్టీలు మధ్య తీవ్ర అసంతృప్తి,ఆవేదనను రేకెత్తించిందని తెలిపారు.
సమగ్ర శిక్షా పథకం కింద నిధులు విడుదల చేయకపోతే, ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడం, విద్యార్థులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టమవుతుందని స్టాలిన్ హెచ్చరించారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రావాల్సిన రూ.2,152 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.