Page Loader
TG Incharge Ministers: పది ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 
పది ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

TG Incharge Ministers: పది ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల మార్పులు గురువారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న మంత్రులలో ముగ్గురికి కొత్తగా ఎలాంటి జిల్లాల బాధ్యతలు అప్పగించకుండా వారిని పక్కనపెట్టింది. వీరిలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు. వీరి స్థానంలో ముగ్గురు కొత్త మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పులతో మొత్తం పది జిల్లాలలో ఆరు జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యతలు చేపట్టనుండగా, మిగిలిన నాలుగు జిల్లాలకు మునుపటి మంత్రులే కొనసాగనున్నారు. కరీంనగర్ జిల్లాకు ఇన్‌ఛార్జిగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానంలో నల్గొండ ఇన్‌ఛార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును నియమించారు. దీంతో, నల్గొండ జిల్లా బాధ్యతలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు అప్పగించారు.

వివరాలు 

ఖమ్మం జిల్లాకు ఇన్‌ఛార్జిగా వాకిటి శ్రీహరి

ఇక, ఖమ్మం జిల్లాకు ఇన్‌ఛార్జిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తప్పించి ఆ బాధ్యతలను వాకిటి శ్రీహరికి అప్పగించారు. అలాగే, మెదక్ జిల్లాలో కొండా సురేఖ స్థానంలో జి.వివేక్ ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. ఇతర రెండు జిల్లాల విషయానికి వస్తే, సీతక్కను ఆదిలాబాద్ జిల్లా నుంచి నిజామాబాద్‌కు మార్చగా, నిజామాబాద్ ఇన్‌ఛార్జిగా ఉన్న జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్‌కు తరలించారు. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు ఇప్పటి వరకు ఇన్‌ఛార్జిగా ఉన్న మంత్రులు తమ బాధ్యతలను కొనసాగించనున్నారు. వీరిలో వరుసగా పొన్నం ప్రభాకర్ (హైదరాబాద్‌), శ్రీధర్‌బాబు (రంగారెడ్డి), దామోదర్ రాజనర్సింహ (మహబూబ్‌నగర్), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (వరంగల్‌) ఉన్నారు.