LOADING...
PM Modi: 'ఇది నవభారతం.. ఎవరికీ భయపడదు': మోదీ
'ఇది నవభారతం.. ఎవరికీ భయపడదు': మోదీ

PM Modi: 'ఇది నవభారతం.. ఎవరికీ భయపడదు': మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈరోజు సెప్టెంబర్ 17 అని పేర్కొని,ఇది చరిత్రలో ముఖ్యమైన రోజు అని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ధైర్యం,సాహసంతో నిజాం పాలన హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేశారని,దీంతో నిజాం ప్రభుత్వం కలిగించిన అక్రమాలు,దుర్వినియోగాల నుంచి సంస్థాన ప్రజలు విముక్తి పొందారని ప్రస్తావించారు. ఇదే సందర్భంలో ఆయన హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ఆ ఘట్టాన్ని గుర్తిస్తున్నామని స్పష్టం చేశారు. భారతదేశ ఐక్యత కోసం ఎందరో సైనికులు తమ ప్రాణాలను అర్పించిన విషయాన్ని కూడా ప్రధాని మోదీ కొనియాడారు.

వివరాలు 

ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు 

ప్రధాని మోదీ అణు ముప్పుల ముందు నూతన భారత దేశం భయపడదని పేర్కొన్నారు. "ఇది నవభారతం. ఎవరికీ భయపడదు. మన సైనిక బలగాలు శత్రువుల భూభాగాల్లోకి ప్రవేశించి వారిని మట్టుబెట్టడం ద్వారా అణు బెదిరింపులకు తలొగ్గలేదని" ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ కూడా అణు బెదిరింపులపై మళ్లీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌ తో భారత్ గట్టి బదులు ఇచ్చిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని పలువురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు అప్పట్లో కథనాలు వెల్లడయ్యాయి.

వివరాలు 

'స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్' కార్యక్రమ ప్రారంభం 

తాజాగా జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఆ దాడుల్లో భారత్ ఆర్మీ తమ రహస్య స్థావరాల్లోకి ఎలా ప్రవేశించి శక్తివంతమైన దాడులు చేశారో అంగీకరించారు. ఈ అంశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ "పాకిస్థాన్ బుద్ధిని బయటపెట్టడం జరిగింది" అని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజున మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తూ 'స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్', 'రాష్ట్రీయ పోషణ్ మాహ్' కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఆరోగ్యం మెరుగుపరచడం, సమర్థ వైద్య సేవలు అందించడం, ఆరోగ్యకరమైన కుటుంబ నిర్మాణం ద్వారా సమగ్ర భారతదేశ అభివృద్ధికి తోడ్పడడం లక్ష్యంగా పెట్టుకున్నారు.