కేరళను బెంబెలెత్తిస్తోన్న నిఫా వైరస్.. ఇద్దరు మృతి
కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నిఫా వైరస్ ప్రభావంతో తాజాగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి సమావేశంలో వైరస్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కోజికోడ్ జిల్లాలో హై అలెర్ట్ ప్రకటించారు. 2018 మే19న తొలిసారిగా కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కేసు నమోదైంది. 2021లోనూ వైరస్ ధాటికి మరణాలు సంభవించాయి. వైరస్ బారిన పడిన ఇద్దరు వ్యక్తులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యశాఖ గుర్తించింది. దీంతో బాధిత బంధువులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ICU)లో అత్యవసరంగా చేర్చి చికిత్సలు అందిస్తున్నారు.
5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి
నిఫా వైరస్ మెదడుకు ఇన్ఫెక్షన్‌ను కలిగించి, మెదడువాపు వచ్చేందుకు దారితీస్తుంది. ఈ వైరస్ ఒక్కసారి శరీరంలోకి ప్రవేశించాక, 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. ఈ కారణంగా తలనొప్పి ఉంటుందని, తీవ్రమైన తలనొప్పి వల్ల కొందరిలో 24 గంటల నుంచి 48 గంటల్లో కోమాలోకి దారి తీసే ప్రమాదం ఉంది. బాధితుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు కనిపిస్తాయి.మెడ బిగుసుపోవడం, వెలుగును చూడలేకపోవడం లాంటి లక్షణాలు ఉండొచ్చు. పలువురిలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. గుండె ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో లక్షణాలు కనిపించకుండానే ఆకస్మాత్తుగా మరణం సంభవించే ఆపద పొంచి ఉంది. గబ్బిలాల నుంచి, పందుల నుంచి, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది.