LOADING...
Telangana: 2030 నాటికి దేశంలో 30% ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యం.. నీతి ఆయోగ్‌ నివేదిక
2030 నాటికి దేశంలో 30% ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యం.. నీతి ఆయోగ్‌ నివేదిక

Telangana: 2030 నాటికి దేశంలో 30% ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యం.. నీతి ఆయోగ్‌ నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2025
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ద్విచక్రవాహన విభాగంలో వీటి వృద్ధి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి మొత్తం వాహన అమ్మకాలలో 30 శాతం వరకు ఈవీలు ఉండాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. దీని ఫలితంగా వాయు కాలుష్యం తగ్గడమే కాకుండా,ఇంధన దిగుమతులను కూడా తగ్గించే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ రంగంలో 2030 వరకు మొత్తం వ్యయం రూ.17.45 లక్షల కోట్లకు మించి ఉంటుందని 'నీతి ఆయోగ్' అంచనా వేసింది. "భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు: దేశ ఆర్థిక వ్యవస్థకు 200 బిలియన్ డాలర్ల అవకాశం" అనే శీర్షికతో ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.

వివరాలు 

వృద్ధి గణాంకాలు 

ఈ నివేదికలో మౌలిక సదుపాయాలు, సాంకేతిక సమస్యలు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని,వాటిని అధిగమిస్తే అమ్మకాలు మరింత వేగంగా పెరుగుతాయని పేర్కొంది. 2016లో కేవలం 50 వేలు మాత్రమే ఉన్న ఈవీ అమ్మకాలు, 2024 నాటికి 20.8 లక్షలకు పెరిగాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు 9.18 లక్షల నుండి 1.87 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న వాహనాల్లో 75 శాతం ద్విచక్రవాహనాలు కాగా, 13 శాతం కార్లే.

వివరాలు 

నీతి ఆయోగ్ సిఫార్సులు 

ప్రోత్సాహక పథకాలపై ఆధారపడకుండా, నిబంధనల రూపంలో క్రమంగా మార్పులు తీసుకురావాలి. ఈ-బస్సులు, ఈ-ట్రక్కులకు రుణాలు సులభంగా లభించే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కొత్త బ్యాటరీ టెక్నాలజీలపై పరిశోధనను పెంపొందించాలి. దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను విస్తరించాలి. 100 నగరాల్లో వాహనాలను ఈవీలుగా మార్చే కార్యక్రమాన్ని అమలు చేయాలి. ఈవీ కొనుగోలు చేసేవారికి రాయితీలు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు ఇవ్వాలి. పెట్రోలు, డీజిల్ వాహనాలపై అధిక రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇంధనంపై ఎక్కువ పన్నులు విధించాలి.

వివరాలు 

ప్రధాన అడ్డంకులు 

ఎలక్ట్రిక్ బస్సులు,ట్రక్కుల ధరలు అధికంగా ఉండటం,దేశంలో ఛార్జింగ్ స్టేషన్లు పరిమితంగానే ఉండటం పెద్ద సమస్యలుగా మారాయి. అలాగే ఈవీల పనితీరు,దీర్ఘకాలిక లాభాలపై వినియోగదారులలో అవగాహన ఇంకా తక్కువగానే ఉంది. ప్రస్తుతానికి బ్యాటరీల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.దేశీయ తయారీకి తగిన ప్రోత్సాహకాలు లభించడం లేదు. అంతేకాకుండా ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించకపోవడం కూడా సమస్యే. దేశవ్యాప్తంగా ఈవీ బస్సుల వాడకానికి ఏకరీతిన విధానం లేకపోవడం మరో అడ్డంకి. కొన్ని రాష్ట్రాలు ప్రయోజనాలు ఇస్తే,మరికొన్ని ఇవ్వడం లేదు. ఈవీ వాహనం రోడ్డుపైకి రాకముందు సుమారు 200రకాల పరీక్షలు జరగాలి. బ్యాటరీ అనుమతుల ప్రక్రియ ఆలస్యమవుతోంది.ఒకసారి అనుమతి పొందిన బ్యాటరీని వేరే కంపెనీ వాడినా మళ్లీ కొత్తగా పరీక్షలు చేయడం వల్ల కాలయాపన జరుగుతోంది.

వివరాలు 

సర్వీస్ సపోర్టు, ఉపాధి అవకాశాలు 

దేశంలో బస్సుల సంఖ్య తక్కువే అయినా, మొత్తం కాలుష్యంలో వాటి పాత్ర 34 శాతం వరకు ఉంది.ప్రస్తుతం 1.54 లక్షల ప్రజా రవాణా బస్సులు ఉన్నప్పటికీ, అందులో 36 వేలు మాత్రమే నగరాల్లో నడుస్తున్నాయి.ఈవీ బ్యాటరీల విషయంలో విదేశాలపై ఆధారపడే పరిస్థితిని తగ్గించుకోవాలి. ప్రస్తుతం సెల్స్‌ను దిగుమతి చేసుకొని అసెంబ్లింగ్ చేస్తున్నా, అవసరాల్లో 30 శాతం మాత్రమే తీరుతున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల సర్వీస్ సపోర్టును పెంచడం అత్యవసరం. ఈవీ వాహనాల సంఖ్య పెరిగేకొద్దీ ఇంజినీర్లు, టెక్నీషియన్లు, డ్రైవర్లు, ఆపరేటర్లు, వర్కర్లు వంటి విభాగాల్లో కొత్తగా అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయి" అని జయరావు, రవాణా నిపుణుడు, ఆర్టీసీ మాజీ ఈడీ పేర్కొన్నారు.