Nitish Kumar: బిహార్ సీఎంగా 9వ సారి ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్
బిహార్‌లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) చీఫ్ నితీష్ కుమార్ 9వ సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్‌తో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, మరో 6 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిహార్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు విపక్ష కూటమి ఇండియా కూటమికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
బిహార్ కొత్త మంత్రివర్గంలో చోటు ఎవరికి?
బిహార్ కొత్త ప్రభుత్వంలో బిజెపికి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ ప్రేమ్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓబీసీ వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరిని, భూమిహార్ సామాజికవర్గానికి విజయ్ కుమార్ సిన్హాని ఉపముఖ్యమంత్రులుగా చేయడం ద్వారా బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ చేసినట్లు స్పష్టమనవుతోంది. జేడీయూ నుంచి విజయ్ చౌదరి, విజేంద్ర యాదవ్, శ్రవణ్ కుమార్, హిందుస్థాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) నుంచి సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ సింగ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం కొత్త మంత్రివర్గం తొలి సమావేశం జరగనుంది.