LOADING...
Rain Alert: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ద్రోణులు.. వానలు దంచి కొట్టుడే!
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ద్రోణులు.. వానలు దంచి కొట్టుడే!

Rain Alert: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ద్రోణులు.. వానలు దంచి కొట్టుడే!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులు రాష్ట్రంలో వర్షాలకు దారితీస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం గురువారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అదే విధంగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చని పేర్కొంది. రాయలసీమలో అనేక ప్రాంతాల్లో, కోస్తాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎక్కడికక్కడ కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వివరాలు 

మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి

ఇక సెప్టెంబర్‌ 22, 23 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని,అది అల్పపీడనంగా మారుతుందా లేదా అనే అంశంపై త్వరలోనే స్పష్టత రానుందని వాతావరణ నిపుణులు తెలిపారు. అనంతరం సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడి,అది మరింత బలపడే అవకాశముందని వారు అంచనా వేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు బంగాళాఖాతాన్ని తాకేలా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

వివరాలు 

ఈ కారణాల వల్లే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

అదేవిధంగా దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు మరొక ద్రోణి వ్యాపించి ఉంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండటంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ కారణాల వల్లే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బుధవారం నాటి వర్షపాతం వివరాల ప్రకారం, ప్రకాశం జిల్లా ఒంగోలులో 6.4 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా రాజాంలో 4 సెంటీమీటర్ల వర్షం నమోదు అయింది.