No Confidence Motion: నేడే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం; లోక్‌సభలో ఏం జరగబోతోంది?
మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలాని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరగనున్నది. మధ్యాహ్నం 12గంటలకు చర్చ ప్రారంభం కానుంది. చర్చ తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నారు. మణిపూర్‌లో జరుగుతున్న జాతి ఘర్షణలపై ప్రధాని నరేంద్ర మోదీని బలవంతంగా మాట్లాడించే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే ఈ తీర్మానానికి గురువారం(ఆగస్టు 10) ప్రధాని సమాధానం ఇవ్వనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో ఉభయ సభలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
లోక్‌సభలో ఎవరి బలమెంత?
అవిశ్వాస తీర్మానంలో మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రతిపక్షాలకు కావలసిన సంఖ్యాబలం లేదు. అవిశ్వాస తీర్మానం వేళ లోక్ సభలో ఏ పార్టీకి ఎంత బలం ఉందో ఒకసారి చూద్దాం. సంఖ్యా పరంగా చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వానికి 331మంది సభ్యులు ఉన్నారు. లోక్‌సభలో మెజారిటీ మార్క్ 272కాగా, అందులో ఒక్క బీజేపీకే 303మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి కేవలం 144మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉంటే, ఏ కూటమిలో లేని బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ వంటి పార్టీల ఎంపీల సంఖ్య 70మంది ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ ఒక్కటి మాత్రమే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది.
అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఎవరు ఎంతసేపు మాట్లాడుతారంటే?
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగే చర్చలో ఏ పార్టీ ఎంత సమయం మాట్లాడాలి అనేది స్పీకర్ ఇప్పటికే నిర్ణయించారు. చర్చ మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభమవుతుంది. ఇందులో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ)కి సుమారు 6 గంటల 41 నిమిషాలు, కాంగ్రెస్ పార్టీకి సుమారు గంటా 15 నిమిషాల సమయాన్ని నిర్ణయించారు. వైసీపీ, శివసేన, జేడీయూ, బీజేడీ, బీఎస్‌పీ, బీఆర్‌ఎస్, ఎల్‌జేపీ పార్టీలకు మొత్తం కలిపి 2గంటల సమయాన్ని స్పీకర్ కేటాయించారు. పార్టీ సభ్యుల సంఖ్య ప్రకారం మాట్లాడే సమయం ఉంటుంది. అదే సమయంలో చిన్న పార్టీలు, స్వతంత్ర ఎంపీలకు 1 గంట 10 నిమిషాల కాల పరిమితిని నిర్ణయించారు.
ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లక్ష్యం ఇదే..
సంఖ్యాపరంగా చూసుకుంంటే లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశమే లేదని ప్రతిపక్షాలకు తెలుసు. అయితే మణిపూర్ సమస్యపై మౌనం వహిస్తున్న ప్రధాని మంత్రి మోదీతో మాట్లాడించేందుకు తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. తాము అవిశ్వాస తీర్మానంలో ప్రవేశపెట్టిన అంశాలకు ప్రధాని మోదీ సమాధానం చెబితే, తాము తమ లక్ష్యాన్ని చేరుకున్నట్లే అని ప్రతిపక్ష ఎంపీలు పేర్కొంటున్నారు. ఈ అవిశ్వాస తీర్మానం ప్రధానిని పార్లమెంటు ఫ్లోర్‌పై హాజరయ్యేలా చేసి, సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని చూపేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు దోహదపడినట్లు ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ స్పీచ్
అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాట్లాడే అవకాశం ఉంది. జూన్‌లో ఆయన మణిపూర్‌లో పర్యటించారు. ఈ క్రమంలో మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై రాహుల్ పార్లమెంటులో ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. అనర్హత వేటు నేపథ్యంలో నాలుగు నెలల తర్వాత పార్లమెంటుకు వచ్చిన రాహుల్ చేసే ప్రసంగాన్ని కూడా దేశ ప్రజలు గమనించనున్నారు. 2018లో ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో రాహుల్ 'కంటికనుకు' జాతీయ స్థాయిలో ఎలాంటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానమంత్రి మోదీ ఎదుర్కొంటున్న రెండో అవిశ్వాస తీర్మానం ఇది. జులై 20, 2018న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
భారత పార్లమెంట్ చరిత్రలో ఇది 28వ అవిశ్వాస తీర్మానం
గతంలో లోక్‌సభ 27 అవిశ్వాస తీర్మానాలను చూసింది. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది 28వ అవిశ్వాస తీర్మానం. అయితే ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఒక్కసారి కూడా అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించలేదు. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చ అసంపూర్తిగా జరిగి, ఓటింగ్ జరగనప్పటికీ, ఆయన రాజీనామా చేశారు. భారత పార్లమెంట్ చరిత్రలో మూడుసార్లు విశ్వాస తీర్మానంలో తమ మెజారిటీని నిరూపించుకోవడంలో పాలక ప్రభుత్వాలు విఫలమయ్యాయి. 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం, 1997లో హెచ్‌డీ దేవెగౌడ ప్రభుత్వం, 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో మెజార్టీని కోల్పోయాయి. ఆ తర్వాత ఆయా ప్రభుత్వాలు కూలిపోయాయి.
అవిశ్వాస తీర్మానం అంటే?
లోక్‌సభ విధివిధానాలు, ప్రవర్తనా నియమావళిలోని రూల్ 198 ప్రకారం, పాలక ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని తెలియజేసేందుకు ప్రతిపాదించిన ప్రక్రియ. 50మంది సహచరుల మద్దతు ఉన్న ఏ లోక్‌సభ ఎంపీ అయినా, ఏ సమయంలోనైనా, మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అవిశ్వాస తీర్మానాన్ని కేవలం లోక్‌సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం స్పీకర్ ఆమోదం పొందినట్లయితే, లోక్‌సభలో అధికార పార్టీ తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే ప్రభుత్వం రద్దు అవుతుంది. కొన్ని సందర్భాల్లో లోక్‌సభలో ప్రభుత్వ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రధానమంత్రి 'విశ్వాస' తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టవచ్చు.