Zeeshan Siddique: బాబా సిద్దిఖీ కుమారుడు జీశాన్‌కు బెదిరింపులు
ముంబై నగరాన్ని కుదిపేసిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య ఇప్పటివరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. బాబా సిద్దిఖీ కుమారుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీ కూడా హిట్‌లిస్ట్‌లో ఉన్నారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, జీశాన్‌కు (Zeeshan Siddique) సైతం హత్య బెదిరింపులు వచ్చాయి అని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
జీశాన్ సిద్దిఖీకు బెదిరింపు కాల్
జీశాన్ సిద్దిఖీ కార్యాలయానికి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చిన కాల్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడంతో పాటు, డబ్బులు ఇవ్వకపోతే జీశాన్‌తో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరించారు. శుక్రవారం సాయంత్రం ఈ కాల్ వచ్చిందని సమాచారం. దీనిపై జీశాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, తదనంతరం నోయిడా ప్రాంతంలో 20 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.
బాబా సిద్దిఖీ హత్య
మహారాష్ట్రలో నవరాత్రి ఉత్సవాల సమయంలో, ముగ్గురు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరపడంతో బాబా సిద్దిఖీ ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దం బాణసంచా శబ్దంతో కలిసిపోవడంతో బయటవారికి వినిపించలేదు. ఈ హత్య వెనుక వ్యాపార విభేదాలు లేదా మురికివాడ అభివృద్ధి ప్రాజెక్ట్‌కు సంబంధించి వివాదాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ హత్యకు తమదే బాధ్యత అని ప్రకటించటంతో మరింత కలకలం రేపింది. జీశాన్ సిద్ధిఖీ (Zeeshan Siddique) ఇటీవల ఎన్సీపీ (Nationalist Congress Party) తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో అజిత్ పవార్ వర్గంలో చేరారు. ఎన్సీపీ తరపున బాంద్రా ఈస్ట్ నుంచి జీశాన్‌ను బరిలో దింపనున్నట్లు పార్టీ ప్రకటించింది.