భగ్గుమంటున్న ఈశాన్య రాష్ట్రం.. మరికాసేపట్లో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా?
మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతుండటంతో ఇప్పటికే వందమందికి పైగా మరణించారు. శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం బీరేస్ సింగ్ తన పదవికి మరికాసేపట్లో రాజీనామా చేసే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మణిపూర్ గవర్నర్ అనసూయ యూకీని కలిసి, సీఎం రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని తెలిసింది. బీరన్‌సింగ్ రాజీనామా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్డడం వంటి రెండు ఆప్షన్లే సీఎం ముందు ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాజ్ భవన్ బయట మహిళలు బీరెన్ సింగ్ రాజీనామా చేయవద్దని నినాదాలు చేశారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు ఈనెల 23న కేంద్ర హోమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యారు.
మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలో వందమంది మృతి
మణిపూర్ లో జరిగిన ఘటనపై అమిత్ షాతో జరిగిన సమావేశంలో చర్చించానని సీఎం బిరెన్ సింగ్ తెలిపారు. గత కొన్ని రోజులగా మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. మరోపక్క రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. మొదట్లో మే 3వ తేదీన కొండ జిల్లాలో నిర్వహించిన గిరిజన సంఘీభావ యాత్ర వల్ల ఈ హింస చెలరేగింది. మణిపూర్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటీవలే మైతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా ఇచ్చింది. అయితే నాగా, కుకీ సామాజిక వర్గాలకు చెందిన వారు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మణిపూర్ జరిగిన అల్లర్ల కారణంగా ఇప్పటికే వందమందికి పైగా మరణించారు.