Page Loader
Nimisha Priya: 'నిమిష ప్రియ విషయంలో భారత్ చేయగలిగిందేమీ లేదు': సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం  
'నిమిష ప్రియ విషయంలో భారత్ చేయగలిగిందేమీ లేదు': సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

Nimisha Priya: 'నిమిష ప్రియ విషయంలో భారత్ చేయగలిగిందేమీ లేదు': సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్షను ఆపేందుకు భారత్‌కు పెద్దగా అవకాశాలు మిగిలిలేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం జరిగిన విచారణలో ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది. అటార్నీ జనరల్‌ వెంకటరమణి దీనిని ధర్మాసనానికి వివరించారు. యెమెన్‌తో భారతదేశానికి అధికారిక దౌత్య సంబంధాలు లేవని, ఉరిశిక్షను వాయిదా వేయడం లేదా నిలిపివేయడం సాధ్యమా అనే విషయంపై యెమెన్‌ ప్రాసిక్యూటర్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. యెమెన్‌ విషయంలో ఉన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా భారత్‌ తరఫున చేయగలిగింది చాలా పరిమితంగా ఉందని తెలిపారు. ఆ దేశాన్ని దౌత్యపరంగా భారత ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించలేదని, బ్లడ్‌ మనీ లావాదేవీలు పూర్తిగా వ్యక్తిగతంగా, ప్రైవేట్‌ స్థాయిలోనే జరిగేవని స్పష్టంచేశారు.

వివరాలు 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలి :  పినరయ్‌ విజయన్‌ 

ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ సందీప్‌ మెహతా స్పందిస్తూ.. ఈ ఘటన జరిగిన తీరుతో ఆందోళన కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఒకవేళ నిమిష ప్రియ ప్రాణాలు కోల్పోతే అది ఎంతో బాధాకరమని చెప్పారు. జూలై 16న నిమిష ప్రియకు ఉరిశిక్ష అమలు చేయనుండడంతో ఆమె కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈనెల 10న పిటిషన్‌ దాఖలైంది. ధర్మాసనం విచారణ ప్రారంభించినప్పటికీ తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. మరోవైపు నిమిష ప్రియ ప్రాణాలను కాపాడేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కోరారు. ఆయన రాసిన లేఖను విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు పంపించినట్లు సమాచారం.

వివరాలు 

కేసు నేపథ్యం 

నిమిష ప్రియ నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్‌కు వెళ్లి అక్కడ ఉద్యోగంలో చేరింది. అనంతరం 2011లో కేరళకు తిరిగి వచ్చి థామస్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత యెమెన్‌లో ఓ క్లినిక్‌ ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే అక్కడి చట్టాల ప్రకారం, స్థానిక వ్యక్తితో భాగస్వామ్యంతోనే వ్యాపారం ప్రారంభించాలి. అందుకే తలాల్‌ అదిబ్‌ మెహది అనే స్థానిక వ్యక్తిని భాగస్వామిగా తీసుకుని, 'అల్‌అమన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌'ను ఏర్పాటు చేశారు. తరువాత నిమిష తన కుమార్తెతో కలిసి కేరళకు వచ్చి సంప్రదాయ వేడుకలు నిర్వహించి, తిరిగి యెమెన్‌కు వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె కేరళలోనే ఉన్నారు. ఇదే సమయంలో వ్యాపార భాగస్వామి మెహది, నిమిషను వేధించడం మొదలుపెట్టాడు.

వివరాలు 

2017లో పాస్‌పోర్ట్‌ తిరిగి పొందేందుకు మెహదికి మత్తు మందు

ఆమె నుంచి డబ్బులు లాక్కొన్నాడు. నిమిషను తన భార్యగా ప్రకటిస్తూ, ఆమె పాస్‌పోర్ట్‌, ఇతర పత్రాలు లాక్కున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా ఆమెను అనుమతించనట్లు తెలుస్తోంది. 2016లో నిమిష ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అంతేకాదు, 2017లో పాస్‌పోర్ట్‌ తిరిగి పొందేందుకు మెహదికి మత్తు మందు ఇచ్చిందని, అయితే దానివల్ల అతడు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం అతడి మృతదేహాన్ని వాటర్‌ ట్యాంక్‌లో పారేసినట్లు తెలిసింది. ఆ తర్వాత సౌదీ అరేబియాకు పారిపోతుండగా ఆమెను సరిహద్దు వద్ద అరెస్టు చేశారు. యెమెన్‌ చట్టాల ప్రకారం, మృతుడి కుటుంబానికి నష్టపరిహారాన్ని (బ్లడ్‌ మనీ) చెల్లిస్తే, వారు నేరారోపితులను క్షమించి వదిలే అవకాశం ఉంది.

వివరాలు 

మృతుడి కుటుంబం నుంచి ఇప్పటివరకు రాని స్పందన 

ఈ నేపథ్యంలో నిమిష కుటుంబ సభ్యులు సుమారు మిలియన్‌ డాలర్లు (రూ. 8.6 కోట్లు) చెల్లించేందుకు సిద్ధమయ్యారు. అయితే మృతుడి కుటుంబం నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదని, సోమవారం బాబుజాన్‌ అనే సామాజిక కార్యకర్త ఓ ఆంగ్ల దినపత్రికకు వెల్లడించారు.