
Onions: గుడ్ న్యూస్.. తగ్గనున్నఉల్లి ధరలు.. హైదరాబాద్‌లో కిలో ఉల్లిపాయ ధర ఎంతంటే ?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని మధ్యతరగతి,పేద ప్రజల కోసం ఇది శుభవార్తే. సాధారణంగా ప్రతి కుటుంబంలో నిత్యావసరంగా ఉండే ఉల్లిపాయలు ఇటీవల భరించలేని ధరలకు చేరాయి.
గత నెలలో హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లిగడ్డల ధర కిలోకు రూ.40 నుండి రూ.50 వరకు చేరింది.
ఈ ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారడంతో, చాలామంది వంటల్లో ఉల్లిపాయల వినియోగాన్ని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే, తాజా పరిణామాలతో ఉల్లి ధరలు తక్కువవుతూ ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి.
యాసంగి పంట తాజాగా మార్కెట్‌కు రావడం ప్రారంభం కావడంతో ధరల పతనం చోటుచేసుకుంది.
ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు రూ.15 నుండి రూ.20 మధ్యే విక్రయించబడుతున్నాయి. ఈ నెలాఖరుకు ధరలు మరింతగా తగ్గే అవకాశముందని మార్కెట్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
పెరుగుతున్న సరఫరా వల్ల ధరలు పడిపోతున్నాయి
హైదరాబాద్ నగరంలోని ప్రధాన హోల్‌సేల్ మార్కెట్లు అయిన ఉస్మాన్‌గంజ్,మలక్‌పేట, సికింద్రాబాద్ మోండా మార్కెట్, బోయిన్‌పల్లి మార్కెట్‌లతో పాటు అనేక రైతు బజార్లలో కూడా ఉల్లిపాయల జమ ఎక్కువగా జరుగుతోంది.
పెరుగుతున్న సరఫరా వల్ల ధరలు పడిపోతున్నాయి.ఇకపోతే ఉల్లిపాయల సరఫరా ఎక్కువగా మహారాష్ట్ర, కర్నూల్ ప్రాంతాల నుంచి జరుగుతోంది.
అదే సమయంలో, తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని తాండూరు, మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్, అలంపూర్, అలాగే నల్గొండ వంటి ప్రాంతాల్లో సుమారు 40,000 ఎకరాల్లో ఉల్లి పంట సాగవుతోంది.
ఈ పంటలు ఏప్రిల్, మే నెలల్లో చేతికి వచ్చి మార్కెట్‌కి చేరుతున్నాయి.
వివరాలు
20 శాతం ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్‌ను తొలగించిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్ నగర మార్కెట్లకు రోజుకు సగటున 15,000 నుండి 18,000 క్వింటాళ్ల వరకు ఉల్లిపాయలు చేరుతున్నాయి.
అంతేగాక, ఉల్లిపాయలపై ఉన్న 20 శాతం ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీని ప్రభావంతో కూడా దేశీయ మార్కెట్లలో ధరలు గణనీయంగా తగ్గాయి.