
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో ఓ సరికొత్త రికార్డు.. 300 కిమీ దూరం నుంచి లక్ష్యాన్ని కూల్చిన భారత వాయుసేన..
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్నిచాటింది. ఇది కేవలం క్రికెట్ రంగంలోనే కాదు, యుద్ధరంగంలోనూ రికార్డులు బద్దలుకొట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాయుసేన చీఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఒక కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్ గగనతలంలో ఉన్న ఐదు యుద్ధవిమానాలు, ఒక పెద్ద రవాణా విమానాన్ని భారత వాయుసేన కూల్చివేసింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఒక లక్ష్యాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల దూరం నుంచే నేలకూల్చడం జరిగింది. అంతర్జాతీయ రికార్డుల ప్రకారం, ఇంతవరకు గగనతలంలో ఉన్న ఏ లక్ష్యాన్నీ ఈ స్థాయి దూరం నుంచి కూల్చివేసిన ఉదాహరణ లేదు. అంతకుముందు సాధించిన గరిష్ఠ దూరం 200 కిలోమీటర్లే.
వివరాలు
రొస్టోవ్ ఆన్ డాన్, క్రస్నడోర్ మధ్య దాడి
2024 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ, రష్యాకు చెందిన ఏ-50 నిఘా విమానాన్ని 200 కిలోమీటర్ల దూరంలో కూల్చింది. బీబీసీ నివేదిక ప్రకారం, ఈ దాడి రొస్టోవ్ ఆన్ డాన్, క్రస్నడోర్ మధ్య చోటుచేసుకుంది. కానీ ఆపరేషన్ సిందూర్ 300 కిలోమీటర్ల లక్ష్యాన్ని కూల్చి, ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఇంతకు ముందు, 2022 ఫిబ్రవరిలో రష్యా ఎస్-400 గగనతల వ్యవస్థ, ఉక్రెయిన్ సు-27 యుద్ధవిమానాన్ని 150 కిలోమీటర్ల దూరంలో పేల్చివేసింది.
వివరాలు
దీనికి ఎందుకింత ప్రాధాన్యం..
దూరంలోని గగనతల లక్ష్యాలను కూల్చడం సాధారణ విషయం కాదు. ఇది అత్యంత అరుదైన సాంకేతిక సామర్థ్యం. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించాలంటే బియాండ్ విజువల్ రేంజ్ (BVR) ఆయుధాలు తప్పనిసరి. భారత్ రష్యా నుంచి ఇటీవల కొనుగోలు చేసిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలో ఇలాంటి ఆధునిక క్షిపణులు ఉన్నాయి. ఈ వ్యవస్థలోని నాలుగు రకాల క్షిపణుల్లో 40ఎన్6 క్షిపణి 400 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలదు. ఆపరేషన్ సిందూర్ లో వాయుసేన ఈ క్షిపణినే సమర్థవంతంగా వినియోగించింది. ఈ విధంగా దూరం నుంచే పాక్ యుద్ధవిమానాలను కూల్చడంతో, అవి భారత గగనతలానికి సమీపించి గైడెడ్ బాంబులు వదిలే ధైర్యం చేయలేదని విశ్లేషకులు అంటున్నారు.
వివరాలు
ఏమిటీ ఎస్-400?
ఎస్-400 ఒక అధునాతన సంచార క్షిపణి రక్షణ వ్యవస్థ. రష్యాలోని ఎన్‌పీవో అల్మాజ్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది పాత ఎస్-300 మోడల్‌కు ఆధునికీకరించిన వెర్షన్. రష్యా ప్రస్తుతం దీని కంటే మరింత శక్తివంతమైన ఎస్-500 వ్యవస్థను తయారు చేస్తోంది. ఎస్-400 శత్రు జామింగ్ (signal jamming) విధానాలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఇది యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను కూడా కచ్చితంగా ధ్వంసం చేయగలదు.
వివరాలు
ఏమిటీ ఎస్-400?
భారత్ 2018లో రష్యాతో ఐదు ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేయడానికి 543 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మూడు ఇప్పటికే భారత్‌కు చేరాయి. మిగతా రెండూ వచ్చే ఏడాది ఆగస్టులో వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో, పంజాబ్, రాజస్థాన్‌లలో ఒక్కో ఎస్-400 వ్యవస్థను మోహరించినట్లు సమాచారం. అలాగే చైనా దిశ నుండి రక్షణ బలోపేతం కోసం అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో మరో వ్యవస్థను అమర్చినట్లు అంచనా.