LOADING...
CRPF Jawan:'పాక్ కు గూఢచర్యం' చేసిన CRPF జవాన్.. ఉగ్రవాద దాడికి 6 రోజుల ముందే పహల్గామ్ లో విధులు..!  
'పాక్ కు గూఢచర్యం' చేసిన CRPF జవాన్.. ఉగ్రవాద దాడికి 6 రోజుల ముందే పహల్గామ్ లో విధులు..!

CRPF Jawan:'పాక్ కు గూఢచర్యం' చేసిన CRPF జవాన్.. ఉగ్రవాద దాడికి 6 రోజుల ముందే పహల్గామ్ లో విధులు..!  

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

పాక్‌కు గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మోతీ రామ్‌ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడే ముందు మోతీ రామ్‌ జాట్‌ జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో విధులు నిర్వర్తించాడని సమాచారం. దాడికి కేవలం ఆరు రోజుల ముందే అతడిని అక్కడి నుంచి బదిలీ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మోతీ రామ్‌ జాట్‌ సీఆర్పీఎఫ్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్సై) హోదాలో పనిచేస్తున్నాడు. 2023 నుండి దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన గూఢచారులకు అందజేస్తున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.

వివరాలు 

పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో సోషల్‌ మీడియాలో మోతీ రామ్‌ సంప్రదింపులు

ఆన్‌లైన్‌ వేదికలపై అతడి చర్యలు అనుమానాస్పదంగా ఉండటంతో, అతడి సామాజిక మాధ్యమ ఖాతాలపై సీఆర్పీఎఫ్‌ గట్టిగా నిఘా పెట్టింది. దీని ఆధారంగా అతడు గూఢచర్యంలో పాల్గొంటున్నట్టు స్పష్టమైంది. ఈ అభియోగాల నేపథ్యంలో అతడిని నాలుగు రోజులపాటు కఠినంగా విచారించిన అనంతరం సీఆర్పీఎఫ్‌ నుండి సర్వీసు నుంచి తొలగించారు. తర్వాత మే 21న అతడిని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. విచారణలో మోతీ రామ్‌ పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో సోషల్‌ మీడియాలో సంప్రదింపులు జరిపేవాడని తేలింది. వారినుంచి అతడు లక్షల రూపాయలు అందుకున్నట్టు, ఆ డబ్బును తన భార్య పేరుపైన ఉన్న బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్టు అధికారులు వెల్లడించారు.

వివరాలు 

పాకిస్థాన్ గూఢచారుల వ్యవహారంపై నిఘాసంస్థలు అప్రమత్తం 

భారత సైనిక దళాల రహస్య ఆపరేషన్లు, భద్రతా బలగాల మోహరింపు వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని మోతీ రామ్‌ పాక్‌కు చేరవేశాడని వెల్లడైంది. ఈ మేరకు ఎన్‌ఐఏ మరింత లోతుగా విచారణ కొనసాగిస్తోంది. గత ఏప్రిల్‌ 22న పహల్గాం ప్రాంతంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన బైసరన్‌ లోయ వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు ఘోరమైన దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ గూఢచారుల వ్యవహారంపై నిఘాసంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. దర్యాప్తులో భాగంగా పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పలు చోట్ల పోలీసులు అరెస్టులు చేశారు. ఉత్తర భారతదేశంలో పాక్ మద్దతుతో ఏర్పడిన గూఢచారి నెట్‌వర్క్‌ చాలా చురుకుగా పని చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తు ద్వారా వెల్లడైంది.