
Pahalgam: నాడు క్లింటన్..నేడు జేడీ వాన్స్: దేశంలో విదేశీ అగ్రనేతల పర్యటనలు సాగుతున్న వేళే ఉగ్రదాడులు..!
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే యత్నంగా,విదేశీ ప్రతినిధుల పర్యటన సమయంలో ఉగ్రదాడులు జరుగుతున్నాయన్న అనుమానాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.
ముఖ్యంగా భారత ప్రధాని విదేశీపర్యటనలో ఉండగా,అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ భార్యతో కలిసి భారత్‌లో పర్యటనలో ఉన్నసమయంలో పహల్గాం దాడి జరిగిన సంగతి గమనార్హం.
నాడు క్లింటన్ పర్యటన సమయంలో..
ఈ తరహా దాడులు గతంలోనూ చోటు చేసుకున్నాయి. 2000 మార్చి 20న అనంత్‌నాగ్ జిల్లాలోని ఛత్తీసింగ్‌పోర గ్రామంలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడి,36 మంది సిక్కువర్గానికి చెందిన అమాయకులను హత్య చేశారు.ఇదంతా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉన్న సమయంలో జరిగింది.ఈ దాడిని పాక్ ఉద్దేశపూర్వకంగా జమ్మూకశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా చర్చకు తెచ్చే ఉద్దేశంతో నిర్వహించిందన్న అభిప్రాయం ఏర్పడింది.
వివరాలు
పహల్గాం దాడి - ఛత్తీసింగ్‌పోర ఘటనకు పోలికలు
ఈ ఉగ్రదాడిలో భాగంగా, ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో రెండు సైనిక వాహనాల్లో వచ్చి, గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ తమను సైనికులమని పరిచయం చేసుకొని, తనిఖీల పేరుతో పురుషులను బయటకు రావాలంటూ ఆదేశించారు.
ఆ తర్వాత వారిని గ్రామంలోని గురుద్వారా వద్దకు చేర్చి, గుంపుగుగా కాల్చిచంపారు.
దాడికి ముందు సైన్యం చేస్తున్నదన్న ముద్ర వేసేందుకు నినాదాలు కూడా చేశారు. చివరికి దర్యాప్తులో ఈ దాడి వెనక పాకిస్థానీ ఉగ్రవాదుల ప్రమేయం ఉందని తేలింది.
తాజాగా పహల్గాంలో జరిగిన దాడిలోనూ ఇదే విధమైన పద్ధతులు కనిపిస్తున్నాయి.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్యతో కలిసి భారత్ పర్యటనలో ఉన్న ఈ సమయంలో,ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు.
వివరాలు
పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగొల్పారా..!
ఇదే సమయంలో పహల్గాంలోని పర్యాటక ప్రాంతంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకుల ఐడెంటిటీ కార్డులను చెక్ చేసి, పురుషులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు.
ఈ దాడి వెనక పాకిస్థాన్ పాత్ర ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి.ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ ఓవర్సీస్ పాకిస్థానీ కన్వెన్షన్‌లో రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఆయన 'కశ్మీర్ గతంలోనూ మా శరీరంలోని రక్తనాళంలా ఉంది, భవిష్యత్తులోనూ అలాగే ఉంటుంది. కశ్మీరీల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలెయ్యం. మన దేశ పునాదులే హిందూ మతంతో భిన్నమైనవన్న భావనలే. పాకిస్థాన్ కథను మీ పిల్లలకు చెప్పండి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ప్రచారంలోకి ఖలీద్ పేరు..
ఇదే సమయంలో పాకిస్థాన్ వాయుసేనకు చెందిన నిఘా,రవాణా విమానాలను కరాచీ నుంచి లాహోర్,రావల్పిండి బేస్‌లకు తరలించడం,పాక్ ముందస్తుగా చురుకుగా ఉందన్న అనుమానాలకు బలమిస్తోంది.
ఈ దాడికి సంబంధించి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఈ సంస్థకు చెందిన సైఫుల్లా కుసురీ అలియాస్ ఖలీద్ ఈ దాడికి వ్యూహకర్తగా ఉన్నట్లు సమాచారం.
ఇతనితోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఇద్దరు ఆపరేటివ్‌లు కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక దాడిని అమలు చేసిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా ముసుగు సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫోర్స్'కు చెందినవారు. ఈ దాడిని వీడియోల రూపంలో చిత్రీకరించినట్లు వార్తలు చెబుతున్నాయి.