
Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం చోటు చేసుకున్న పాక్ షెల్లింగ్ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
అధికారిక సమాచారం ప్రకారం, రేజర్వానీ నుంచి బారాముల్లాకు వెళ్తున్న వాహనం మొహురా సమీపంలో షెల్లింగ్ దాడికి గురయ్యింది.
ఈ దాడిలో బశీర్ ఖాన్ భార్య నాగ్రిస్ బేగం ప్రాణాలు కోల్పోగా, రాజీక్ అహ్మద్ ఖాన్ భార్య హఫీజా గాయాలపాలయ్యారు. హఫీజాను వెంటనే జీఎంసీ బారాముల్లాకు తరలించారు.
కొద్ది రోజులుగా పాక్ కశ్మీర్ సరిహద్దుల్లో ఉరి, కుప్వారా ప్రాంతాల్లో నిరంతరంగా షెల్లింగ్‌కు పాల్పడుతోంది.
ఇదే క్రమంలో గురువారం రాత్రి పాకిస్థాన్, జమ్ముకశ్మీర్‌తో పాటు పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది.
Details
సరిహద్దు గ్రామాల్లో తీవ్ర ఆందోళన
పఠాన్‌కోట్ (పంజాబ్), జైసల్మేర్(రాజస్థాన్) ప్రాంతాల్లో తీవ్ర కాల్పులకు పాల్పడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, భారత వైమానిక రక్షణ వ్యవస్థలు తక్షణమే స్పందించాయి.
పాక్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా ఛేదించాయి. జైసల్మేర్‌లో పాకిస్తాన్ డ్రోన్లను అడ్డుకునేందుకు భారత సాయుధ దళాలు చురుగ్గా వ్యవహరించాయి.
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ తర్వాత మరింత ముదురాయి.
తాజాగా భారత్‌లోని 15 నగరాలను లక్ష్యంగా చేసుకునే పాకిస్తాన్ కుట్రను కూడా భారత రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా భగ్నం చేశాయి.
ఇలాంటి పరిస్థితుల్లో, సరిహద్దు గ్రామాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. భద్రతా దళాలు పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నా పాక్ తరచుగా కాల్పులకు పాల్పడుతూ పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చుతోంది.