Palvai Sravanti: మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి 23,906 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థిగా బీజేపీ నుంచి పార్టీలోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ ప్రకటించింది. మునుగోడు టికెట్‌ను పాల్వాయి స్రవంతి ఆశించారు. ఈ క్రమంలో తనను అభ్యర్థిగా ఎంపిక చేయకపోవడంతో ఆమె పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.
ఖమ్మంలో మాజీ మంత్రి సంభాని, మానవతా రాయ్ రాజీనామా
ఖమ్మం జిల్లాలో కూడా పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్‌కు షాకిచ్చారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కె. మానవతా రాయ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రగతి భవన్‌లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వారిని లాంఛనంగా బీఆర్‌ఎస్‌లో ఆహ్వానించారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నోముల ప్రకాశరావు, జగదీశ్వర్, ప్రవీణ్‌లాలా, ఎండీ షాకీర్, బీఎస్పీ నేతలు రమావత్ రమేష్ నాయక్, ధర్మాపురం శ్రీనివాస్ తదితరులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.