పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి
పశ్చిమ బెంగాల్‌లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఒకవైపు పోలింగ్ జరుతుండగా, మరోవైపు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ హింసలో మొత్తం 15మంది చనిపోయారు. మరణించిన వారిలో టీఎంసీ నుంచి 8మంది, సీపీఎం నుంచి ముగ్గురు, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కరు చొప్పున మృతి చెందారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. ముర్షిదాబాద్‌లో ముగ్గురు టీఎంసీ సభ్యులు, ఒక కాంగ్రెస్ కార్యకర్త మరణించారు. కూచ్ బెహార్‌లో ఇద్దరు (బీజేపీ నుంచి ఒకరు, టీఎంసీ నుంచి ఒకరు) చనిపోయారు. తూర్పు బుర్ద్వాన్‌లో ఇద్దరు సీపీఐ కార్యకర్తలు, ఒక టీఎంసీ కార్యకర్త హత్యకు గురయ్యారు. టీఎంసీ నాయకుడు ఒకరు మాల్దాలో మరణించగా, మరొక టీఎంసీ నేత దక్షిణ 24పరగణాలలో ప్రాణాలు కోల్పోయాడు.
అమిత్ షా జోక్యం చేసుకోవాలని బీజేపీ లేఖ
పంచాయతీ ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై బీజేపీ స్పందించింది. రాష్ట్రంలో హింస నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకురాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ లేఖ రాశారు. హత్యలు, గందరగోళం లేకుండా మమతా బెనర్జీ రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించలేరని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో తన పార్టీ ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ఆమె ఎంతకైనా దిగజారిపోతారన్నారు. హింసపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ నాయకులు సువేందు అధికారి, మంగళ్ పాండేతో మాట్లాడారు. ఈ ప్రజాస్వామ్య మరణాన్ని బీజేపీ సహించబోదని నడ్డా వారితో చెప్పారు. ఇది ఎన్నికల పేరుతో జరిగిన మారణకాండగా బీజేపీ అభివర్ణించింది.