జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ
మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జీ20 సదస్సును నిర్వహిస్తున్న నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే వైమానిక దళం, పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను దిల్లీ అంతటా మోహరించారు. సెప్టెంబరు 9,10 తేదీల్లో దిల్లీలో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే భద్రతాపరమైన అంశాలను ఖరారు చేసేందుకు కేంద్ర సెక్యూరిటీ వింగ్ దిల్లీ పోలీసులతో సమావేశమైంది. దేశవిదేశాల నుంచి వచ్చే దేశాధినేతల వీఐపీ భద్రత కోసం సీఆర్పీఎఫ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. అలాగే ఎన్ఎస్‌జీ యూనిట్‌లోని యాంటీ టెర్రర్, యాంటీ-స్బోటేజ్, యాంటీ డ్రోన్ విభాగాలను కూడా అప్రమత్తం చేశారు.
జీ20 వేదిక వద్ద జామర్ల ఏర్పాటు
యాంటీ టెర్రర్ కార్యకలాపాలపై నిఘా పెట్టే బాధ్యతను ఎన్‌ఎస్‌జీకి అప్పగించారు. బాంబ్ డిస్పోజల్, యాంటీ డ్రోన్, యాంటీ బయోలాజికల్, కెమికల్ వెపన్ యూనిట్లను భారత ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంగా ఉంచింది. జామింగ్ పరికరాలతో కూడిన యాంటీ డ్రోన్ యూనిట్లను జీ20 వేదిక వద్ద ఇప్పటికే మోహరించారు. కేంద్ర ప్రభుత్వానికి దేశాధ్యక్షులు బస చేసే హోటళ్లకు భద్రత కల్పించడం సవాల్‌గా మారిందనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు ఐటీసీ మౌర్యలో, చైనా అధ్యక్షుడు తాజ్ ప్యాలెస్‌లో, బ్రిటన్ ప్రధాని షాంగ్రి-లాలో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ది ఒబెరాయ్‌లో బస చేస్తారని తెలుస్తోంది. ఇంపీరియల్, లీలా ప్యాలెస్, తాజ్ మాన్‌సింగ్, ది లలిత్, ది క్లారిడ్జ్‌లు న్యూఢిల్లీ ప్రాంతంలోని కొన్ని ఇతర హోటళ్లలో ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.
వీఐపీలో బస చేసే హోటళ్లలో భద్రతాపరమైన సవాళ్లు
వీఐపీలో బస చేసే హోటళ్లలో భద్రతా పరమైన సవాళ్లు ఎదురవుతున్నట్లు సెక్యూరిటీ గ్రిడ్ ఆఫీసర్ తెలిపారు. వీఐపీ బస చేసే అంతస్తులోకి వెళ్లే వారికి ప్రత్యేకంగా యాక్సెస్ కార్డ్‌లను జారీ చేసినప్పటికీ ఈ జాగ్రత్తలు సరిపోవని తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో హోటళ్ల పై కప్పులపై హెలికాప్టర్ ల్యాండింగ్ అంశం చాలా ఇబ్బందికరంగా మారింది. చాలా హోటళ్లు చాపర్లు లాండ్ అవడానికి అనుకూలంగా లేవు. హోటల్ పైకప్పులు చిన్నగా ఉండటం, కొన్నింటి పై కప్పులపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం వంటి సమస్యలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కమాండోలను హోటల్ భవనాలపై దింపవలసి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దానిపై ఐఏఎఫ్, ఎన్ఎస్‌జీ ఆధ్వర్యంలో రెండు రోజుల్లో నియమించబడిన డ్రిల్స్ నిర్వహించనున్నారు.
1,000 మంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన కమాండోలు
జీ20 సదస్సు కోసం కేంద్రం ప్రత్యేకంగా శిక్షణ పొందిన 1000మంది కమాండోలను సిద్ధం చేసింది. రెండు నెలలుగా నోయిడాలోని ఫోర్స్ అకాడమీలో వీరు వీఐపీ భద్రత కోసం ప్రత్యేక శిక్షణ పొందారు. శిక్షణ కోసం ఎంపిక చేయబడిన సిబ్బందికి ముందుగా ఎస్‌పీజీ, ఎన్ఎస్‌జీలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. దిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా జీ20 వేదిక, హోటళ్ల వద్ద ప్రముఖులకు భద్రత కల్పిస్తారు. ప్రముఖులను తీసుకెళ్లే డ్రైవర్లందరూ సీఆర్పీఎఫ్ నుంచే ఉంటారు. ప్రముఖులను తీసుకెళ్లేందుకు పలు బ్యాకప్ వాహనాలను కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. దాదాపు 4000మంది దిల్లీ పోలీసులు ఈ భద్రతలో భాగం అవుతున్నారు.