G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ
దిల్లీ వేదికగా జరుగుతున్న రెండు రోజుల జీ20 సమావేశాలు ముగిసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో తదుపరి జీ20 అధ్యక్ష బాధ్యతలను మోదీ బ్రెజిల్‌కు అప్పగించారు. ఈ మేరకు మోదీ బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వాకు ప్రెసిడెన్సీ సూచిక అయిన గ్రావెల్‌ను అందజేశారు. అనంతరం మోదీ ఆయన్ను అభినందించారు. డిసెంబరు 1న బ్రెజిల్ అధికారికంగా జీ20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది. ఈ సందర్భంగా లూలా డ సిల్వా మాట్లాడుతూ.. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల గళాన్ని వినిపించడానికి భారత్ చేస్తున్న కృషిని అభినందించారు. ఆకలికి వ్యతిరేకంగా పోరాటం, స్థిరమైన అభివృద్ధి వంటి పలు అంశాలను ప్రధానంగా జీ20 జాబితాలో చేర్చనున్నట్లు లులా డ సిల్వా తెలిపారు.
జీ20 సమావేశాలకు ముగింపు పలికిన మోదీ
నవంబర్‌లో జీ20 వర్చువల్ సెషన్: మోదీ
దిల్లీ జీ20 సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 'ప్రపంచంలో శాంతి నెలకొనాలి' అనే నినాదంతో ముగించారు. ఈ సందర్భంగా సదస్సులో చేసిన తీర్మానాలపై స్పందించారు. 'వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్' అనేది జీ20కి రోడ్‌మ్యాప్‌గా మారినందుకు ఆనందంగా ఉందన్నారు. 2023 నవంబర్ వరకు భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలను కలిగి ఉందని మోదీ చెప్పారు. గత రెండు రోజులుగా వచ్చిన సలహాలను సమీక్షించడానికి నవంబర్‌లో వర్చువల్ సెషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సెషన్‌లో పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు.
ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు అవసరం: మోదీ
ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ సంస్థల్లో సంస్కరణల అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. కొత్త ప్రపంచ నిర్మాణంలో కొత్త ఆలోచనలు ప్రతిబింబించాలని మోదీ పిలుపునిచ్చారు. 51మంది సభ్యులతో ఐక్యరాజ్య సమితి స్థాపించబడినప్పుడు ప్రపంచం భిన్నంగా ఉందన్నారు. ఇప్పుడు ఐరాసలో సభ్యదేశాల సంఖ్య 200కి పెరిగనట్లు పేర్కొన్నారు. కాలానుగుణంగా మారని వారు తమ ఔచిత్యాన్ని కోల్పోతారని ప్రకృతి ధర్మనం అని మోదీ అన్నారు. ఇదిలా ఉంటే, ఆదివారం సెషన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొనలేదు. ఆయన వియత్నాంకు వెళ్లడంతో చివరి రోజుకు గైర్హాజరయ్యారు. దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జీ20 నాయకులు ఆదివారం మహాత్మగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.