కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 20 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సిడ్నీలో వేలాదిమంది భారతీయులు హాజరైన కార్యక్రమం గురించి మోదీ ఈ సందర్బంగా ప్రస్తావించారు.
ఆ కార్యక్రమానికి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మాత్రమే కాకుండా, ఆ దేశ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకులు కూడా హాజరైనట్లు చెప్పారు. దీని ద్వారా తామంతా ఒక్కటే అనే సంకేతాన్ని ఇచ్చినట్లు మోదీ గుర్తుచేశారు.
జపాన్, పపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలో తన పర్యటన ముగించుకుని ప్రధాని గురువారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు.
మోదీకి బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికేందుకు తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
దిల్లీ
ఇది గాంధీ జన్మించిన భూమి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి: మోదీ
కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను విదేశాలకు ఎగుమతి చేసినందుకు కేంద్రాన్ని ప్రశ్నించినందుకు ప్రతిపక్షాన్ని కూడా ప్రధానమంత్రి తప్పుబట్టారు.
సంక్షోభ సమయాల్లో మోదీ ప్రపంచానికి ఎందుకు టీకాలు ఇస్తున్నారని ప్రతిపక్షాలు అడిగాయన్నారు. ఇది కర్మ భూమి అని, బుద్ధుడి భూమి అని, గాంధీ జన్మించిన భూమి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
తాము శత్రువులను కూడా ప్రేమిస్తామని ఈ సందర్భంగా మోదీ ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను తన జాతిని ప్రపంచం ముందు గర్వపడేలా చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు సంపూర్ణ మెజార్టీతో ఎన్నుకున్న ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
తాను మాట్లాడినప్పుడు ప్రపంచం తనను మాత్రమే నమ్మదని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 140కోట్ల మంది భారతీయులందరినీ నమ్ముతుందని మోదీ స్పష్టం చేశారు.
దిల్లీ
భారతదేశం గురించి తెలుసుకునేందుకు ప్రపంచం ఆసక్తిగా ఉంది: మోదీ
మూడు దేశాల పర్యటన సందర్భంగా తాను కలిసిన నాయకులు భారతదేశం పట్ల ఎంతో సానుకూల దృక్పథంతో ఉన్నారని చెప్పారు.
భారత్ జీ20 అధ్యక్ష పదవిని చాలా అద్భుతంగా నిర్వహించడం పట్ల ప్రశంసలు కురిపించినట్లు ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు.
ఇది భారతీయులందరికీ చాలా గర్వకారణం అన్నారు.
మన సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడేటప్పుడు భారతదేశం గురించి తెలుసుకునేందుకు ప్రపంచం ఆసక్తిగా ఉందని మోదీ చెప్పారు.
ఆలయాలపై ఎలాంటి దాడి జరిగినా ఆమోదయోగ్యం కాదని తాను చెబుతున్నప్పుడు ప్రపంచం తనతో ఏకీభవిస్తున్న విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దిల్లీ
రాష్ట్రపతి ముర్మును పక్కన పెట్టడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం
ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని దాదాపు 20ప్రతిపక్ష పార్టీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.
ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పూర్తిగా పక్కనపెట్టి స్వయంగా కొత్త భవనాన్ని ప్రారంభించాలన్న మోదీ నిర్ణయం దేశ ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడిగా విపక్షాలు అభివర్ణించాయి.
పార్లమెంటులో ప్రధానికి అప్రజాస్వామిక చర్యలు కొత్త కాదని ప్రతిపక్ష పార్టీల నాయకులు అన్నారు. భారత ప్రజల సమస్యలను లేవనెత్తినప్పుడు విపక్ష పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించి, సస్పెండ్ చేయడం మోదీకి అలవాటే అన్నారు.
కొత్త భవనంలో తమకు విలువ లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ప్రారంభోత్సవాన్ని బహిష్కరించే నిర్ణయాన్ని దేశ ప్రజాస్వామ్య నీతి, రాజ్యాంగ విలువలకు ఘోరమైన అవమానంగా అభివర్ణించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీ విమానాశ్రయంలో ప్రధాని మోదీ ప్రసంగం
#WATCH | When I talk about the culture of my country, I look into the eyes of the world. This confidence has come because you have formed a government with an absolute majority in the country. Those who have come here are people who love India, not PM Modi: PM Modi pic.twitter.com/CoiDVxaSjA
— ANI (@ANI) May 25, 2023