
PM Modi: జపాన్ బుల్లెట్ రైలులో జపాన్ ప్రధాని ఇషిబాతో కలిసి ప్రయాణించిన మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. అక్కడ వ్యాపార వర్గాల ప్రతినిధులతో సమావేశమై, భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. శనివారం పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి మోదీ బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. ఈ ప్రయాణం సందర్భంగా కొత్తగా అభివృద్ధి చేస్తున్న 'ఆల్ఫా-ఎక్స్' రైలును రైలు కిటికీ నుంచి గమనించారు. రైలు సాంకేతిక అంశాలపై జేఆర్ ఈస్ట్ సంస్థ ఛైర్మన్ వివరణ ఇచ్చారు. ఈ సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వివరాలను జపాన్ ప్రధాని ఇషిబా ఎక్స్‌లో (పూర్వపు ట్విట్టర్) షేర్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జపాన్ ప్రధాని ఇషిబాతో కలిసి ప్రయాణించిన మోదీ
Japan PM Shigeru Ishiba tweets, "With Prime Minister Modi to Sendai..." pic.twitter.com/k9xljgOeV5
— ANI (@ANI) August 30, 2025
వివరాలు
జపాన్ - భారత్ మధ్య కీలక ఒప్పందం
తదుపరి కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ సెండాయ్‌లోని తోహోకు షింకన్‌సెన్ ప్లాంట్‌ను పరిశీలించనున్నారు. భారత్‌లో ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం 2030 నాటికి తరలించనున్న E-10 కోచ్‌ల తయారీ, అమలు అంశాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అనంతరం ఇరు దేశాల మధ్య ఒక కీలక ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్లు సమాచారం. జపాన్ పర్యటన పూర్తయిన తర్వాత ఆదివారం ప్రధాని మోదీ చైనాకు వెళ్తారు. టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో మోదీ సమావేశం కానున్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మోడీ చైనాకు వెళ్తున్నారు.
వివరాలు
జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం
ఈ సమ్మిట్‌కు ఆతిథ్యమిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మొత్తం 11 దేశాల నేతలకు ఆహ్వానాలు పంపించారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అలాగే ఎస్‌సీవో సభ్య దేశాలతో పాటు నేపాల్, మాల్దీవులు, తుర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కంబోడియా, మంగోలియా, తుర్క్‌మెనిస్తాన్, లావోస్, అర్మేనియా, అజర్‌బైజాన్ వంటి దేశాల నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. చైనాలో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలిసారిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.