Page Loader
Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ .. 

Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ .. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా పేరుగాంచిన చినాబ్ ఉక్కు వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. కట్‌ఢా నుంచి కశ్మీర్ దాకా నడిచే వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఈ వంతెనను ప్రజల వినియోగానికి తీసుకొచ్చారు. శివాలిక్,పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయను రైలు మార్గంలో భారత్ మిగతా ప్రాంతాలతో అనుసంధానించాలన్న ఆశయం, బ్రిటిష్ పాలన కాలం నాటినుంచి ఉన్న ఈ దీర్ఘకాలిక కల, ఇప్పుడే సాకారమైంది. ఈ సందర్భంగా కట్‌ఢాలో దాదాపు రూ.46వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు.

వివరాలు 

పహల్గాం ఉగ్రదాడి అనంతరం  మోదీ జమ్మూకశ్మీర్‌కి రావడం ఇదే మొదటిసారి

కట్‌ఢా-శ్రీనగర్ మధ్య నడిచే రైలుకు జెండా ఊపారు.అంతేకాకుండా, దేశంలోనే మొట్టమొదటి తీగల ఆధారిత రైల్వే వంతెనగా గుర్తింపు పొందిన అంజీ కేబుల్ బ్రిడ్జిని కూడా ప్రధాని ప్రారంభించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌కి రావడం ఇదే మొదటిసారి. ఆయన ఉధంపుర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కి చేరుకున్న తర్వాత చినాబ్ వంతెన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఆ తరువాత జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. అనంతరం కట్‌ఢాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉగ్రవాద హంతక చర్యల నేపథ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా దళాలను విస్తృతంగా మోహరించారు.

వివరాలు 

చినాబ్ వంతెన విశేషాలు 

ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ చినాబ్ వంతెన, కశ్మీర్‌ను భారత దేశ మిగతా ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానించేందుకు కీలక పాత్ర పోషిస్తోంది. చినాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించబడిన ఈ వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన (ఎత్తు 275 మీటర్లు) ప్రపంచంలోనే ఎత్తైనదిగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు చినాబ్ వంతెన ఆ రికార్డును చెరిపేసింది. దీనిని ప్రముఖ ప్యారిస్ ఐఫిల్ టవర్‌తో పోలిస్తే ఇది దాదాపు 30 మీటర్ల ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెనను అత్యాధునిక ఇంజినీరింగ్ నిపుణతతో నిర్మించారు.భూకంపాలు, వరదలు, పేలుళ్లును సైతం తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో దీనిని నిర్మించారు.

వివరాలు 

 23 ఏళ్ల అనంతరం సాకారమైన కల 

దీని ప్రారంభంతో జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఇంజినీర్ల అంచనాల ప్రకారం, ఈ వంతెన ఆయుష్కాలం సుమారు 120 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడపవచ్చు. ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1,486 కోట్లు వెచ్చించింది. ఈ కట్టడంలో 28 వేల టన్నుల ఉక్కును వినియోగించినట్లు అధికారిక సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు 2002లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో రూపకల్పన జరిగింది. అంటే ఇప్పుడు దాదాపు 23 ఏళ్ల అనంతరం ఈ కల సాకారమైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చినాబ్ వంతెన ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ ..