PM Modi: మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు
భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల సూత్రధారిగా పేరుపొందిన మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర ముఖ్య నేతలు మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకుని, నివాళి అర్పించారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యలతో నిన్న రాత్రి ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
7 రోజుల సంతాప దినాలు
మన్మోహన్ సింగ్ భారతదేశానికి పదేళ్ల పాటు ప్రధానిగా సేవలందించారు. ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా కూడా విధులు నిర్వహించారు. ప్రధాని గా పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ పనిచేశారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం పూర్తి అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆయన మృతికి సంతాపంగా 7 రోజుల సంతాప దినాలను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని నివాసంలో ప్రజలు సందర్శన కోసం ఉంచారు. శనివారం (డిసెంబరు 28) ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. ఆ తరువాత, రాజ్‌ఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.