PM Modi on Rahul Gandhi: రాహుల్ గాంధీ వయోనాడ్ లో కూడా ఓడిపోతారు: పీఎం మోదీ
ప్రధాని(Prime Minister)నరేంద్ర మోదీ(Narendra Modi) మహారాష్ట్ర(Maharashtra)లో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ ఎన్నికల్లో భాగంగా కేరళ (Kerala)లోని వాయోనాడ్ (Vaynod)లో పోటీ చేస్తున్న కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓడిపోతారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గాన్ని కోల్పోయిన తర్వాత ఓడిపోబోయేది వాయోనాడే అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో శనివారం ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 లో అమేథీ లోక్ సభ నియోజక వర్గంలో రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారని, దీంతో పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీ బద్ధలైనట్లు తెలిపారు.
ఎన్డీయే గాలి బలంగా వీస్తోంది: ప్రధాని మోదీ
ఈ ఎన్నికల తర్వాత కూడా రాహుల్ గాంధీ మరో సురక్షితమైన నియోజకవర్గాన్నివెతుక్కుంటారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రాటిట్ అలియన్స్ (ఎన్డీయే) గాలి బలంగా వీస్తోందని, ఓటింగ్ సరళి కూడా అలాగే కనిపిస్తోందని చెప్పారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకుండానే పార్లమెంట్ లో ఉండేందుకు రాజ్యసభను ఎంచుకుంటున్నారని ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని పరోక్షంగా ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకుండా ఉండటం ఆ ఫ్యామిలీకి ఇదే మొదటిసారని చెప్పారు. కాంగ్రెస్ అనుసరించిన విధానాల వల్లే దేశంలో వ్యవసాయం సక్షోంభంలో కూరుకుపోయిందని, ఇప్పుడున్న వ్యవసాయ సంక్షోభం ఇప్పటిది కాదని గుర్తు చేశారు.
సామాన్యుల, రైతుల శ్రేయస్సుకు కాంగ్రెస్ అడ్డుపడుతోంది: మోదీ
సామాన్యులు, రైతుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని విమర్శించారు. తలో పాతిక సీట్ల కోసం అంతర్గత కుమ్ములాటల మధ్య, నాయకత్వ లోపంతో ఇండియా కూటమి కునారిల్లుతోందని ఎద్దేవా చేశారు. జూన్ 4 న ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమిలో ఒకరిపై ఒకరు ఇంకా ఫైట్ చేసుకుంటూనే ఉంటారన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచిన అమేథీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇప్పటివరకు వారి అభ్యర్థిని ప్రకటించలేదని చెప్పారు. అదేవిధంగా బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించలేదని వెల్లడించారు. కాగా, అమేథీ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారన్న విలేకరుల ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ ''ఆ నిర్ణయం పార్టీ చూసుకుంటుంది. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే దానికి బద్ధుడను''అని తప్పించుకున్నారు.