దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన
దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ పనులకు ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 6న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. రైల్వేస్టేషన్ చుట్టూ నగరం లేదా పట్టణాభివృద్దిని పెంచేందుకు ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, వారసత్వం, వాస్తుకు ప్రాధాన్యత ఇచ్చేలా స్టేషన్ కు రూపకల్పన చేస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ రెండో సారి అధికారంలోకి వచ్చాక అత్యాధునిక ప్రజా రవాణా సదుపాయాలపై దృష్టిపెట్టింది. ఈ మేరకు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దాదాపు రూ. 24,470 కోట్లతో ఆయా స్టేషన్లకు మరమ్మతులు చేయనున్నారు.
తెలంగాణలో 21, ఏపీలో 18 స్టేషన్లకు ఆధునీకీకరణ
దేశ ప్రజారవాణాకు రైల్వేలు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వేస్టేషన్‌లల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించాల్సి ఉందని గతంలోనే మోదీ చెప్పారు. ఇందుకు అనుగుణంగానే 1309 రైలు స్టేషన్లను ఆధునికీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని రూపొందించారు. దేశంలోని 27 రాష్ట్రాలు, యూటీ ప్రాంతాలకు సంబంధించి 508 రైల్వేస్టేషన్లను ఆ శాఖ ఎంపిక చేసింది. యూపీ 55 రాజస్థాన్ 55 బీహార్ 49 మహారాష్ట్ర 44 పశ్చిమ బెంగాల్ 37 మధ్యప్రదేశ్ 34 అస్సాం 32 ఒడిశా 25 పంజాబ్ 22 గుజరాత్ 21 తెలంగాణ 21 జార్ఖండ్‌లో 20 ఆంధ్రప్రదేశ్ 18 తమిళనాడులో 18 హర్యానాలో 15 కర్నాటకలో 13 రైల్వే స్టేషన్లు ఉండటం గమనార్హం.