కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా
ఒడిశా కటక్‌లోని వివిధ ఆస్పత్రుల్లో వైద్య పొందుతున్న క్షతగాత్రులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలపై మంత్రులు, అధికారులతో కలిసి మోదీ స్యయంగా పర్యవేక్షించారు. దాదాపుగా 900 మంది వరకూ గాయపడి కటక్‌లోని పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఒడిశాలో ప్రధానమంత్రి పర్యటన కొనసాగుతోంది. తొలుత రైలు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు మోదీ. మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ఘటనలో దాదాపు 300కిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఘటనాస్థలి బాలేశ్వర్ కి ప్రధాని చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.
ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ
మోదీ వచ్చే సమయానికి అక్కడే ఉన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని బాధితులను, క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు మోదీ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్టర్ ద్వారా బాలాసోర్ ని సందర్శించారు. తొలుత ప్రధాని నేరుగా ప్రమాద స్థలికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే అధికారులతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రాథమిక నివేదికను మోదీకి వివరించారు. అనంతరం ఆయన నేరుగా కటక్ చేరుకుని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు.