LOADING...
Narendra Modi: ట్రంప్‌ టారిఫ్‌ల పెంపుపై స్పందించిన ప్రధాని మోదీ
ట్రంప్‌ టారిఫ్‌ల పెంపుపై స్పందించిన ప్రధాని మోదీ

Narendra Modi: ట్రంప్‌ టారిఫ్‌ల పెంపుపై స్పందించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోంది అన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అమలులో ఉన్న 25 శాతం దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 50 శాతానికి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందిస్తూ, రైతుల హక్కుల విషయంలో ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంగా వ్యాఖ్యానించారు. దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌. స్వామినాథన్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

వివరాలు 

రైతుల ప్రయోజనాల కోసం నేను వ్యక్తిగతంగా ఎంతైనా చెల్లించేందుకు సిద్ధం: మోదీ 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాతో వాణిజ్య పరమైన సమస్యల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, పరోక్షంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం.. "రైతుల సంక్షేమమే మా ప్రథమ లక్ష్యం. రైతులు, మత్స్యకారులు, పాడిపరిశ్రమలపై మేమెప్పుడూ రాజీపడము. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే దేశానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని మాకు తెలుసు. అయినా, రైతుల ప్రయోజనాల కోసం నేను వ్యక్తిగతంగా ఎంతైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను. భారత్ సిద్ధంగా ఉంది" అని తెలిపారు. ఇప్పటికే భారత్‌ నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌, తాజాగా ఈ మొత్తాన్ని 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. గతంలో ప్రకటించిన 25 శాతం సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి.

వివరాలు 

రొయ్యలు, జంతు ఉత్పత్తులపై అదనపు భారం

ఇక ఈ నెల 27వ తేదీ నుంచి అదనంగా విధించిన మరో 25 శాతం సుంకాలు కూడా అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల భారతదేశపు వస్త్ర పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, తోలుపరిశ్రమలపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. ముఖ్యంగా, రొయ్యలు, జంతు ఉత్పత్తులపై అదనపు భారంగా మారబోతోంది. భారత్‌ నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా చాలా కాలంగా దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతోంది. అయితే, ఆ మేరకు మినహాయింపులు ఇస్తే భారతదేశ రైతులకు నష్టం జరుగుతుందన్న ఆందోళన ఉంది.

వివరాలు 

భారతదేశంపై దిగుమతి సుంకాల రెట్టింపు

వ్యవసాయ రంగం దేశీయ రాజకీయాల్లో ఎంతో సున్నితమైన అంశం కావడంతో భారత్‌ ఈ డిమాండ్‌కు తలొగ్గలేదు. గతంలో కూడా ఈ విషయంలో ఇరుదేశాల మధ్య అనేక చర్చలు జరిగినప్పటికీ, ఏకాభిప్రాయానికి రావడం సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో అమెరికా అసంతృప్తి చెందిందని భావిస్తున్నారు. అంతేకాకుండా, భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుండటాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ రెండు అంశాల నేపథ్యంలోనే ట్రంప్‌ భారతదేశంపై దిగుమతి సుంకాలను రెట్టింపు చేసినట్లు అర్థమవుతోంది.