Page Loader
PM Modi: 'ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం'.. ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
'ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం'.. ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

PM Modi: 'ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం'.. ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తానని గతంలో ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అప్పట్లో ఉగ్రవాదులకు ఊహించని రీతిలో శిక్షవిధిస్తానని చెప్పిన మాటను ఇప్పుడు అమలుచేశానని స్పష్టం చేశారు. శుక్రవారం బిహార్‌లోని కరకట్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ''రాముడి మార్గంలో నడిచే మనం ఒకసారి మాట ఇచ్చితే అది నిలబెట్టుకుంటాం.ఇదే కొత్త భారత్‌ విధానం.పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.ఆ ఘటన జరిగిన మరుసటి రోజే నేను ఏప్రిల్ 24న బిహార్‌కి వచ్చాను.అప్పట్లోనే పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తానని ఈ భూమిపై నుంచే దేశ ప్రజలకు మాట ఇచ్చాను.ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చాకే మళ్లీ బిహార్‌ అడుగుపెట్టాను''అని తెలిపారు.

వివరాలు 

పామును తలతో సహా నాశనం చేస్తాం

ఉగ్రవాదులపై భారత్‌ చర్యలు తీసుకున్న తీరును వివరిస్తూ.. ''పాకిస్తాన్‌ మన మహిళల సిందూర శక్తిని చూసింది. పాక్‌ ఆర్మీ రక్షణలో ఉన్నామని భావించిన ఉగ్రవాదులను మేము నిష్క్రియులుగా మార్చాం. వారి సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్‌లను క్షణాల్లోనే నాశనం చేశాం. ఆపరేషన్‌ సిందూర్‌ అనేది మన మిలిటరీ తుంపల్లో ఉన్న అనేక బాణాల్లో ఒకటే. పాకిస్తాన్‌ దీన్ని గుర్తుంచుకోవాలి. ఉగ్రవాదంపై మన పోరాటం ఇంకా పూర్తవలేదు, అలాగే తగ్గిపోలేదు. మరోసారి అలాంటి దాడికి పాల్పడితే.. ఈసారి ఆ పామును తలతో సహా నాశనం చేస్తాం'' అని హెచ్చరించారు.

వివరాలు 

మోదీ పర్యటనకు ప్రాధాన్యం

ప్రధాని మోదీ ప్రస్తుతం రెండు రోజుల బిహార్ పర్యటనలో ఉన్నారు. గురువారం పట్నాలో నిర్వహించిన మరో ర్యాలీలో కూడా పాల్గొన్నారు. అప్పట్లో ఆయన మాట్లాడుతూ ''దేశం ఎప్పుడూ ముందుకు సాగుతుంది.. బిహార్‌లో అభివృద్ధి ఆగదు'' అని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.