PM Modi: జాతి ప్రయోజనాలే సర్వోన్నతం.. లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్ ముఖాముఖిలో ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌తో శాంతి కాంక్షిస్తూ చేసిన ప్రతి ప్రయత్నానూ మోసం,శత్రుత్వంతోనే ఎదుర్కొన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఇస్లామాబాద్ నాయకత్వంపైనే ఉందన్నారు.
2014లో,రెండు దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభించాలనే ఉద్దేశంతో తన ప్రమాణస్వీకారానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు గుర్తుచేశారు.
ప్రస్తుతం పాకిస్థాన్ ప్రజలు కూడా శాంతిని కోరుకుంటున్నారని తాను భావిస్తున్నానన్నారు.
గతంలో సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడం ద్వారా శాంతి,సామరస్యంపై భారతదేశం చూపిన కట్టుబాటును వెల్లడించామన్నారు.
అయితే, ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలు అమెరికన్ కృత్రిమ మేధ (AI) పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్‌కు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మోదీ వెల్లడించారు.
వివరాలు
దృఢసంకల్పం గల నేత ట్రంప్
"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పరస్పర విశ్వాస సంబంధం ఉంది. ఎందుకంటే, మేమిద్దరం జాతి ప్రయోజనాలనే సర్వోన్నతంగా భావిస్తాం.రెండోసారి అధికారంలోకి రాకముందే, ట్రంప్ మనసులో అమెరికా అభివృద్ధిపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఉంది. ఆయనపై జరిగిన కాల్పుల సమయంలోనూ అదే దృఢసంకల్పాన్ని చూశాను" అని మోదీ వ్యాఖ్యానించారు.
భారత్-చైనా మధ్య ఆరోగ్యకర పోటీ ఉండాలి
భారత్-చైనా మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించాలని తాను కోరుకుంటున్నానని మోదీ తెలిపారు. వాస్తవాధీన రేఖ (LAC) వద్ద 2020కు ముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించేందుకు ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని అన్నారు. భారత్-చైనా మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని, అది ఘర్షణకు దారితీయకూడదని స్పష్టం చేశారు.
వివరాలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి చర్చల ద్వారానే పరిష్కారం
రష్యా-ఉక్రెయిన్ వివాదానికి శాశ్వత పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని మోదీ తెలిపారు. "యుద్ధక్షేత్రంలో సమస్యలు పరిష్కారం కావు. భారత్ ఈ వివాదంలో తటస్థంగా లేదుగానీ, శాంతికి కట్టుబడి ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీలతో నాకు మంచి సంబంధాలున్నాయి" అని ఆయన తెలిపారు.
వివరాలు
వివేకానందుని సిద్ధాంతాలే ఆరెస్సెస్ బోధన
విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణమని, తాను విమర్శలను స్వాగతిస్తానని మోదీ అన్నారు.
"నా శక్తి నా పేరులో లేదు. 140 కోట్ల మంది భారతీయుల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలో ఉంది. దేశ సేవే ప్రధానం అని ఆరెస్సెస్ బోధిస్తుంది. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నేను అక్కడ నేర్చుకున్నాను. ఆరెస్సెస్ ఒక గొప్ప వ్యవస్థ. వేదాలు, స్వామి వివేకానందుని ఉపదేశాలే సంఘ్ సభ్యులకు నేర్పబడతాయి" అని వివరించారు.
వివరాలు
పేదరికంలో గడిచిన బాల్యం
తన చిన్నతనం పూర్తిగా పేదరికంలో గడిచిందని మోదీ తెలిపారు.
"నా తెల్ల బూట్లు మెరిపించేందుకు పాఠశాలలో వాడేసిన సుద్ద ముక్కలను సేకరించేవాడిని. ఓ గొప్ప కార్యానికి నన్ను ఈ స్థాయికి నడిపించింది. నేను ఒంటరివాడిని కాదు. నన్ను ఇక్కడికి పంపిన శక్తి ఎప్పుడూ నాకు తోడుగానే ఉంటుంది. మా నాన్న టీ దుకాణానికి వచ్చే వాళ్లను చూసి నేనెంతో నేర్చుకున్నాను. ప్రజా జీవితంలో వాటినే అనుసరిస్తున్నాను" అని అన్నారు.