LOADING...
Siddaramaiah: కమల్ హాసన్ వివాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి.. కన్నడ ప్రజల దీర్ఘకాల చరిత్ర గురించి తెలియదు 
కమల్ హాసన్ వివాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి

Siddaramaiah: కమల్ హాసన్ వివాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి.. కన్నడ ప్రజల దీర్ఘకాల చరిత్ర గురించి తెలియదు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ భాష నుంచి కన్నడ భాష ఉద్భవించిందన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తాను నటించిన థగ్‌లైఫ్ సినిమా ఆడియో విడుదల సందర్భంగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితం,తన కుటుంబం తమిళ భాషేనని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ కమల్‌ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. కన్నడ భాష పుట్టుకకు తమిళ భాషకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కన్నడకు ఒక గొప్ప, సుదీర్ఘ చరిత్ర ఉందని వ్యాఖ్యానించారు. కమల్ హాసన్‌కు ఈ విషయాలు తెలియవని ఎద్దేవా చేశారు.

వివరాలు 

శివరాజ్ కుమార్ సమక్షంలోనే వ్యాఖ్యలు 

"కన్నడ పుట్టుకకు తమిళంతో సంబంధం లేదు. కన్నడకు గొప్ప చరిత్ర ఉంది. బహుశా కమల్ హాసన్‌కు ఇవి తెలియకపోవచ్చు" అని వ్యాఖ్యానించారు. క‌మ‌ల్ హాస‌న్ నటించిన థ‌గ్ లైఫ్ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. "కన్నడ భాష తమిళం నుంచి ఉద్భవించింది" అని అన్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన ప్రసంగాన్ని "ఉయిరే, ఉరవే తమిళే" (అంటే నా జీవం, నా బంధం తమిళ భాషే) అంటూ ప్రారంభించిన కమల్ హాసన్, అనంతరం శివరాజ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

వివరాలు 

థ‌గ్‌లైఫ్ సినిమా బేనర్లను చించేసిన ఆందోళనకారులు

"శివరాజ్ కుమార్ వేరే రాష్ట్రంలో ఉంటున్నా,ఆయన నా కుటుంబ సభ్యుడు.అందుకే ఆయన ఇక్కడ ఉన్నారు. అందుకే నా ప్రసంగం మొదట్లోనే 'నా జీవితం, నా కుటుంబం తమిళ భాష' అని చెప్పాను. మీ భాష కూడా తమిళం నుంచే పుట్టింది. అందువల్ల మీరు మా భాగస్వాములే" అని ఆయన అన్నారు. కానీ కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు కన్నడ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. బెంగళూరులో పలువురు ఆందోళనకారులు థ‌గ్‌లైఫ్ సినిమా బేనర్లను చించివేశారు. "కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలా? కానీ మా భాషను అవమానిస్తారా?" అంటూ వారు ఘాటుగా ప్రశ్నించారు. కమల్ హాసన్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి.