
Jagdeep Dhankhar: జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా ఆమోదించిన రాష్ట్రపతి
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాను ఆమోదించారు. సోమవారం అనూహ్యంగా ధన్‌ఖర్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ ద్వారా తెలియజేశారు. మంగళవారం ధన్‌ఖర్ రాజీనామాను ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది. ధన్‌ఖర్ రాజీనామా అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ధన్‌ఖర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశం పంపించారు. ఇదిలా ఉండగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభా కార్యకలాపాలను ధన్‌ఖర్ సజావుగా నిర్వహించారు. సభ్యులతో సమావేశాలు కూడా నిర్వహించారు.
వివరాలు
ధన్‌ఖర్ రాజీనామా వెనుక బలమైన కారణం: జైరాం రమేష్
అయితే సాయంత్రం మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకొని రాజీనామా చేసినట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఇంత అకస్మాత్తుగా రాజీనామా చేయడమేంటి? అనే ప్రశ్న రాజకీయ పార్టీల్లో చర్చకు దారి తీసింది. ఇక ధన్‌ఖర్ రాజీనామాపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్‌ఖర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏదో బలమైన కారణం ఉందని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. పార్టీలోని కొన్ని శక్తులు అవమానించడంతో ధన్‌ఖర్ ఇంత త్వరగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి నియామకంపై ఊహాగానాలు మొదలయ్యాయి. జేడీయూ నేత, డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ కు ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశాలున్నాయని సమాచారం.