
NEET Row: నీట్ వ్యతిరేక బిల్లు.. తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించిన రాష్ట్రపతి
ఈ వార్తాకథనం ఏంటి
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే.
ఈ అంశంపై కేంద్రం, డీఎంకే ప్రభుత్వ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ పరిస్థితులలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (MK Stalin) ప్రభిత్వానికి ఎదురుదెబ్బకు గురైంది.
తమిళనాడు ప్రభుత్వం పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తిరస్కరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్ర శాసనసభలో వెల్లడించారు.
వివరాలు
ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశం
"కేంద్రం మన రాష్ట్రాన్ని నీట్ నుంచి మినహాయించేందుకు నిరాకరిస్తోంది. ఇది దక్షిణాది రాష్ట్రాన్ని అవమానించడమే. కానీ వారు మన అభ్యర్థనను తిరస్కరించినా, మన పోరాటాన్ని ఆపలేరు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తాం. న్యాయ నిపుణులను సంప్రదిస్తాం" అని స్టాలిన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.
అలాగే, దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
వివరాలు
నీట్ బిల్లు.. విద్యార్థుల ఆందోళన
నీట్ పరీక్ష (NEET Row) కారణంగా తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
ఎంబీబీఎస్,బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ అర్హత పరీక్ష నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టింది.
ఈ బిల్లులో, 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించాలని నిబంధన తీసుకొచ్చారు.
ఈ బిల్లును తమిళనాడు అసెంబ్లీ ఇప్పటికే 2021, 2022లో రెండు సార్లు ఆమోదించింది.
అనంతరం గవర్నర్ వద్దకు పంపగా, పలుమార్లు తిరస్కరణకు గురైంది.
దీంతో కొన్ని మార్పులు చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం మళ్లీ పంపారు. అయితే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ బిల్లును తిరస్కరించారు.
వివరాలు
కేంద్రం - తమిళనాడు మధ్య పెరుగుతున్న వివాదం
ఇప్పటికే హిందీ వివాదం, డీలిమిటేషన్ వంటి అంశాలపై కేంద్రం మరియు తమిళనాడు ప్రభుత్వ మధ్య వివాదం కొనసాగుతోంది.
తాజా పరిణామంగా నీట్ బిల్లును తిరస్కరించడం ఈ విభేదాలను మరింత ముదిర్చే అవకాశం ఉంది.
2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారే అవకాశముంది.