LOADING...
#NewsBytesExplainer: మళ్లీ తెరపైకి తుమ్మిడిహట్టి.. కాంగ్రెస్ వ్యూహం ఏమిటి?
మళ్లీ తెరపైకి తుమ్మిడిహట్టి.. కాంగ్రెస్ వ్యూహం ఏమిటి?

#NewsBytesExplainer: మళ్లీ తెరపైకి తుమ్మిడిహట్టి.. కాంగ్రెస్ వ్యూహం ఏమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తెలంగాణలో రాజకీయ తుఫాను కొనసాగుతున్న వేళ, కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రాజెక్టును చర్చకు తెచ్చింది. ఆ ప్రాజెక్టు పేరు తుమ్మిడిహట్టి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలనలో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగం. పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన నివేదిక అనంతరం, తుమ్మిడిహట్టి నిర్మాణం తప్పనిసరిగా చేపడతామని ప్రస్తుత ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇక దానికి ఉన్న నేపథ్యం ఏమిటో వివరంగా చూద్దాం.

వివరాలు 

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఆరంభం 

2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అప్పటి ముఖ్యమంత్రి,దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి దీన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులో తుమ్మిడిహట్టి భాగం కీలకం. ఆదిలాబాద్ జిల్లాలోని కౌటాల మండల పరిధిలో ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో ఒక పెద్ద బ్యారేజీ నిర్మించాలని అసలు ప్రణాళిక. దీని ద్వారా సేకరించే నీటిని ఎత్తిపోసి, అప్పటి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల భూములకు సాగునీరు అందించడం లక్ష్యం. అయితే, ఈ ప్రతిపాదనపై మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తరువాత రాజకీయ మార్పులు చోటుచేసుకోవడం, రాష్ట్ర విభజన జరగడం వంటివి జరుగగా, తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

వివరాలు 

ఎత్తు తగ్గింపు - రీడిజైన్ నిర్ణయం 

మహారాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుండి 148 మీటర్లకు తగ్గించాలని సూచించింది. దీనితో 2014లో నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును తిరిగి రూపకల్పన చేసింది. ఈ మార్పుల కారణంగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని వదిలి, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద మూడు బ్యారేజీలను కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించారు. అప్పటినుండి ఈ నిర్ణయంపై సాంకేతిక, రాజకీయ విమర్శలు నిరంతరం వినిపిస్తున్నాయి. తాజాగా పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక లోపాలను గుర్తించింది.

వివరాలు 

తుమ్మిడిహట్టి నిర్మాణం ద్వారా లాభాలు 

కాంగ్రెస్ ప్రకారం,తుమ్మిడిహట్టి డిజైన్ చాలా సింపుల్. ఇక్కడ బ్యారేజీ నిర్మిస్తే, ఎత్తిపోతల అవసరం లేకుండా, గ్రావిటీ ద్వారా కాలువల్లో నీరు ప్రవహించి, ఆదిలాబాద్ ప్రాంతంలోని పొలాలకు చేరుతుంది. కాళేశ్వరంలో వాడుతున్నట్టుగా భారీ మోటార్లు, పంపులు అవసరం ఉండవు. దీని వల్ల ప్రాజెక్టు వ్యయం తగ్గి, విద్యుత్ ఖర్చు భారీగా ఆదా అవుతుంది. కాంగ్రెస్ లెక్కల ప్రకారం, తక్కువ పెట్టుబడితో తుమ్మిడిహట్టి నిర్మిస్తే, కనీసం రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు.

వివరాలు 

కాంగ్రెస్ చెబుతున్న కారణాలు 

ప్రస్తుత ప్రభుత్వ వాదన ప్రకారం, కాళేశ్వరంలో ఉన్న సాంకేతిక లోపాలే తుమ్మిడిహట్టిని పునరుద్ధరించడానికి ప్రధాన కారణం. పీసీ ఘోష్ నివేదికలో, కాళేశ్వరం రీడిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలను స్పష్టంగా ప్రస్తావించారు. ముఖ్యంగా, మేడిగడ్డ బ్యారేజీ అస్థిరమైన ఇసుక నేలపై నిర్మించడం వల్ల, పిల్లర్లు ఇసుకలో కూరుకుపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ మంత్రుల మాటల్లో, మేడిగడ్డ మరమ్మతులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు,అది ఎంత భద్రంగా నిలబడుతుందో కూడా చెప్పలేము. అందుకే తుమ్మిడిహట్టి వద్ద రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసి,అక్కడి నుండి నీటిని సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలకు తరలించే ఆలోచనలో ఉన్నారు. ఇది తక్కువ ఖర్చుతో తాత్కాలిక ప్రత్యామ్నాయ ప్రణాళికగా ఉపయోగపడుతుందని లెక్కలు చెబుతున్నాయి.

వివరాలు 

రాజకీయ కారణాలు కూడా ఉన్నాయా ?

అలాగే,కాళేశ్వరం నిర్వహణలో అయ్యే భారీ ఖర్చు కూడా తగ్గుతుందని వాదిస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి రాగానే తన ముద్ర వేసే విధానాలు అవలంబించడం సహజం. కాంగ్రెస్,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు,కాళేశ్వరం అవినీతికి కేంద్రమని,డిజైన్,నిర్మాణంలో లోపాలున్నాయని పదే పదే విమర్శించింది. అదే సమయంలో బీఆర్‌ఎస్,దానిని తెలంగాణకు వరమని పదేళ్లు ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత, కాంగ్రెస్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసి,బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన తప్పులను నివేదిక ద్వారా వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు తుమ్మిడిహట్టి నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా,బీఆర్‌ఎస్ చేసిన తప్పులను తాము సరిదిద్దుతున్నామనే ప్రచారం చేసుకునే అవకాశాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటుంది. అదనంగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమ రాజకీయ స్థిరీకరణకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అంచనా.