
Puja Khedkar: మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా ఖేద్కర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఆమెపై మోసానికి సంబంధించిన కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
పూజా ఖేద్కర్ తప్పుడు విధానాన్ని అనుసరిస్తూ ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్‌ను పొందినట్లు,అలాగే వికలాంగుల కోటాలో సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ బీవీ నాగరత్న,జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారిస్తూ పూజా ఖేద్కర్ విచారణకు పూర్తిగా సహకరించాలని సూచించింది.
వివరాలు
ఆమె ఏమైనా మర్డర్ చేసిందా?
"ఆమె డ్రగ్ మాఫియా కాదు,ఉగ్రవాదిని కూడా కాదు,భారత దండన చట్టంలోని 302 సెక్షన్ కింద ఆమెపై హత్య ఆరోపణలేమీ లేవు,NDPS చట్టానికి సంబంధించిన నేరం కూడా చేయలేదు.. ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయింది,భవిష్యత్తులో ఉద్యోగం దొరికే అవకాశాలేవీ లేవని పేర్కొంది.విచారణ త్వరగా పూర్తి చేయాలని సూచించింది. తద్వారా వ్యవస్థలో స్పష్టత రావాలన్నదే ధర్మాసనం ఉద్దేశం" అని సుప్రీం బెంచ్ తన తీర్పులో పేర్కొన్నది.
కేసుకు సంబంధించిన పరిణామాలను పరిశీలించిన తర్వాత,ఢిల్లీ హైకోర్టు ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
అయితే,ఈ బెయిల్ మంజూరుకు ఢిల్లీ పోలీసుల తరఫున న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఖేద్కర్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, ఆమె విచారణలో సహకరించడంలేదని ఆయన వాదించారు.
వివరాలు
క్రిమినల్ కేసు నమోదు
2022 యూపీఎస్సీ దరఖాస్తులో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.
ఆమె ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మాత్రం ఆమెపై క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుంది.
ఆమెపై ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్ కేసు కూడా నమోదైంది. నకిలీ గుర్తింపు వివరాలతో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైందని ఆరోపించారు.
అదే విధంగా ఢిల్లీ పోలీసులు కూడా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.