Pune Bus Rape Case: పూణె రేప్ కేసు నిందితుడి ఫొటో విడుదల.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష రివార్డు
ఈ వార్తాకథనం ఏంటి
పూణెలో చోటుచేసుకున్న దారుణ అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది.
మంగళవారం తెల్లవారుజామున, రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్ ప్రాంతంలో 27 ఏళ్ల యువతిపై 36 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాధితురాలు ఇళ్లల్లో పని చేసే కార్మికురాలు. రోజువారీ విధుల నిమిత్తం బస్సు ఎక్కేందుకు వచ్చిన సమయంలో, నిందితుడు "వేరే చోట బస్సు ఉంది" అంటూ మోసపూరిత మాటలు చెప్పి ఆమెను ఖాళీగా ఉన్న బస్సులోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు.
ఈ ఘటన గురించి బాధితురాలు తన స్నేహితురాలికి తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. మహారాష్ట్రలో మహిళలకు భద్రత లేదు అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.
వివరాలు
పోలీసుల దర్యాప్తు: నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు
ఈ కేసు మహారాష్ట్రను మాత్రమే కాకుండా,దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఘటనపై స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని దత్తాత్రేయ రామ్‌దాస్ గడేగాగా గుర్తించారు.
అతనిపై గతంలోనూ అనేక నేర కేసులు నమోదయ్యాయి. 2019 నుంచి బెయిల్‌పై బయట ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
నిందితుడిని పట్టుకునేందుకు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
అయితే, అతడు ముఖం కవర్ చేసుకోవడంతో గుర్తించడంలో సమస్య ఎదురవుతోంది.
అందుకే అతని ఫోటో విడుదల చేసి, ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష రివార్డు ప్రకటించారు.
అదనంగా, నిందితుడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
పోలీసులు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు సహా అనుమానిత ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
వివరాలు
అత్యాచారం ఘటన: సమీపంలోనే పోలీస్ స్టేషన్!
పోలీసుల ప్రకారం,మంగళవారం ఉదయం 5:45 - 6:00 గంటల మధ్య ఈ ఘటన జరిగింది.
అత్యాచారం చోటుచేసుకున్న ప్రదేశం నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం షాక్‌కు గురిచేస్తోంది.
నిందితుడు ముందుగా బాధితురాలిని "చెల్లి" అని సంబోధించి నమ్మించాడు.
తన స్వస్థలమైన సతారా జిల్లాకు వెళ్ళేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో, "ఇక్కడ బస్సు లేదు, వేరే చోట ఉంది" అంటూ తీసుకెళ్లాడు.
సీసీటీవీ ఫుటేజ్‌లో ఇద్దరూ కలిసి నడుస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.
వివరాలు
కఠిన చర్యలకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం
అయితే, బాధితురాలు తొలుత బస్సులోకి వెళ్లేందుకు సంకోచించిందని, కానీ "లోపల ప్రయాణికులు నిద్రపోతున్నారు" అని నిందితుడు అబద్ధం చెప్పి బలవంతంగా తీసుకెళ్లాడని చెప్పింది.
లోపలకి వెళ్లిన వెంటనే డోర్‌లు మూసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వెంటనే బస్సు నుంచి కిందకి దూకి పారిపోయాడు.
ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దారుణం క్షమించరానిదని, నిందితుడికి ఉరిశిక్ష విధించాలి అని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా తక్షణమే నిందితుడిని పట్టుకుని శిక్షించాలి అని అధికారులను ఆదేశించారు.
అదనంగా, బాధితురాలికి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.