LOADING...
Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు 
పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు

Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ తక్షణమే గట్టి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో,పాకిస్థాన్‌ భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం భారీ మెరుపు దాడులు జరిపింది. 'ఆపరేషన్‌ సిందూర్‌'గా పేరుగాంచిన ఈ దాడిని విజయవంతంగా అమలు చేసినట్లు భారత ఆర్మీ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనుంది. దేశవ్యాప్తంగా భద్రతను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టారు.ముఖ్యంగా పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించగా,ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలకు సమగ్ర భద్రతను కల్పించేందుకు పోలీస్‌ శాఖ,రక్షణ విభాగంతో సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని ఆ రాష్ట్ర డీజీపీ సూచించారు.

వివరాలు 

ఏవిధమైన పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం: జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ 

దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల సమయంలో ఎలా స్పందించాలి అన్న అంశంపై మాక్‌ డ్రిల్లులు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 'ఆపరేషన్‌ సిందూర్‌' నేపథ్యంలో,దేశానికి ఎదురయ్యే ఏవిధమైన పరిస్థితినైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ,అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లకు సబ్‌ కంట్రోల్‌ ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. ఖాళీ చేయించబడ్డ గ్రామాల ప్రజలకు అవసరమైన ఆహారం,రవాణా తదితర సదుపాయాలను అందించాలని అధికారులను ఆదేశించారు. జమ్మూ ప్రాంతంలో భారత సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను మరింత కఠినతరం చేసినట్లు సీఎం ఒమర్‌ అబ్దుల్లా వెల్లడించారు.

వివరాలు 

కశ్మీర్‌ ప్రాంత పరిస్థితిపై అమిత్‌ షా,ఒమర్‌ అబ్దుల్లా సంప్రదింపులు

అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి పౌరుల ప్రాణాలను కాపాడటం భద్రతా బలగాల కర్తవ్యమని స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఒమర్‌ అబ్దుల్లా కశ్మీర్‌ ప్రాంత పరిస్థితిపై నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజల రక్షణ కోసం అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు.

వివరాలు 

జమ్మూకశ్మీర్‌లోని ఐక్యరాజ్యసమితి ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న పాక్‌ 

భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'లో ఇప్పటివరకు 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం. ఈ దాడి పాక్‌కు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.దాంతో, సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంట పాక్‌ యధేచ్ఛగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల ఘటనలో పదిమంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ మేరకు భారత ఆర్మీ వివరాలు వెల్లడించింది. పాక్‌ కాల్పుల్లో ప్రయోగించిన ఫిరంగి గోలీలు కశ్మీర్‌లోని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫీల్డ్‌ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే అవి పూంఛ్‌ ప్రాంతంలోని గేటు వెలుపల పడినట్లు పేర్కొంది.