LOADING...
Puri Rath Yatra chariot wheels: పార్లమెంట్ ఆవరణలో పూరీ రథయాత్ర రథ చక్రాల ఏర్పాటు 

Puri Rath Yatra chariot wheels: పార్లమెంట్ ఆవరణలో పూరీ రథయాత్ర రథ చక్రాల ఏర్పాటు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2025
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ ప్రాంగణంలో పూరీ శ్రీ జగన్నాథుని రథచక్రాలు కొలువుదీరనున్నాయి. ఈ మేరకు శ్రీ జగన్నాథ ఆలయ యంత్రాంగం (SJTA) చేసిన ప్రతిపాదనను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, స్థానిక ఎంపీ సంబిత్ పాత్ర తదితరులు శుక్రవారం పూరీ ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ''లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పూరీ శ్రీక్షేత్రం సందర్శన సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో జగన్నాథ రథచక్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాము. దీనికి ఆయన అంగీకరించారు'' అని SJTA ఒక ప్రకటనలో పేర్కొంది.

వివరాలు 

ప్రతి ఏడాది రథాల నిర్మాణంలో కొత్త కలప

ఈ రథయాత్రలోని జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర రథాల్లో ఒక్కో చక్రం చొప్పున ప్రత్యేకంగా దిల్లీకి తరలిస్తామని కూడా వెల్లడించారు. ఒడిశా సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ చక్రాలను పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. పూరీలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అట్టహాసంగా రథయాత్ర నిర్వహిస్తారు. జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుల కోసం మూడు రథాలను తయారుచేస్తారు. రథయాత్ర ముగిసిన తర్వాత వాటిని భాగాలుగా విడదీస్తారు. కొన్ని ముఖ్యమైన భాగాలను మినహా, ప్రతి ఏడాది రథాల నిర్మాణంలో కొత్త కలపను ఉపయోగిస్తారు. విడదీసిన రథ భాగాలను గిడ్డంగుల్లో భద్రపరుస్తారు. చక్రాలు సహా వాటిలో కొన్ని భాగాలను వేలం ద్వారా కూడా విక్రయిస్తారు.