Page Loader
Rabies Deaths: భారతదేశంలో రేబిస్ మరణాలు 2.5 రెట్లు పెరుగుదల.. ప్రతి నెలా నలుగురు మృతి
భారతదేశంలో రేబిస్ మరణాలు 2.5 రెట్లు పెరుగుదల.. ప్రతి నెలా నలుగురు మృతి

Rabies Deaths: భారతదేశంలో రేబిస్ మరణాలు 2.5 రెట్లు పెరుగుదల.. ప్రతి నెలా నలుగురు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2025
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో రేబిస్ వ్యాధి కారణంగా మరణాలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ వల్ల జరిగే మరణాల్లో 36 శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, దేశంలో నివేదించబడిన రేబిస్ కేసులు, మరణాల్లో దాదాపు 30-60 శాతం 15 ఏళ్ల లోపు పిల్లలకే సంబంధించడమే కావడం గమనార్హం. ముఖ్యంగా పిల్లలు కుక్క కాటు గురించి తల్లిదండ్రులకు, వైద్యులకు నివేదించకపోవడం వల్లే మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.

Details

2030 నాటికి రేబిస్-రహిత దేశంగా మార్చడానికి ప్రణాళికలు

2024 క్యాలెండర్ ఇయర్‌లో 5.19 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి, వీటిలో 15 ఏళ్ల లోపు పిల్లలే అధికంగా ఉన్నారు. దేశంలో రేబిస్ వ్యాప్తికి ప్రధాన కారణం జనావాసాల్లో టీకాలు వేయని వీధి కుక్కల సంఖ్య పెరగడమేనని ప్రభుత్వం పేర్కొంది. భారతదేశాన్ని 2030 నాటికి రేబిస్-రహిత దేశంగా మార్చే లక్ష్యంతో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు 24 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు రేబిస్‌ను గుర్తించదగిన వ్యాధిగా వర్గీకరించాయి. 2024లో దేశవ్యాప్తంగా రేబిస్ కేసులు గణనీయంగా పెరిగాయని నివేదిక వెల్లడించింది. 2022లో మొత్తం 21.80 లక్షల కుక్కకాటు కేసులు నమోదవ్వగా, రేబిస్ కారణంగా 21 మంది మరణించారు.

Details

మహారాష్ట్రలో అధికం

2024లో ఈ సంఖ్య 21.95 లక్షలకు చేరగా, రేబిస్ మరణాల సంఖ్య 54కి పెరిగింది. 2023లో కుక్కకాటు కేసులు 30.43 లక్షలు కాగా, రేబిస్ కారణంగా 50 మంది మరణించారు. సగటున ప్రతి నెలా నలుగురు రేబిస్ వల్ల మరణిస్తున్నారు, వారిలో మహారాష్ట్రలోనే కనీసం ఒకరు ఉంటున్నారని గణాంకాలు సూచిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2022లో 21 మరణాలుగా ఉన్న రేబిస్ మరణాలు 2024 నాటికి 54కి పెరిగాయి . దీని ద్వారా రేబిస్ మరణాల రేటు 2.5 రెట్లు పెరిగిందని నివేదిక పేర్కొంది.