Amit Shah: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జమ్ముకశ్మీర్‌ను తిరిగి ఉగ్రవాదంలోకి నెట్టాలని చూస్తున్నాయి: అమిత్ షా
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో, ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తోంది. ప్రచారానికి చివరి రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా కిష్త్వార్ ప్రాంతంలో రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ, జమ్మూ కశ్మీర్‌ను తిరిగి తీవ్రవాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) ఉగ్రవాదంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారిని జైళ్ల నుంచి విడుదల చేయాలని యోచిస్తున్నారని అమిత్ షా విమర్శించారు.
ఆర్టికల్ 370 రద్దు చేసిన చరిత్ర బీజేపీదే: అమిత్ షా
ఎన్నికల ప్రచారంలో భాగంగా, అమిత్ షా మాట్లాడుతూ "ఈ ప్రాంతంలోని అమరవీరుల్ని స్మరించుకుంటూ, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మించేందుకు కట్టుబడి ఉన్నాము" అని హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన చరిత్ర బీజేపీదేనని ఆయన పునరుద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో సెప్టెంబర్ 18, 25, మరియు అక్టోబర్ 1న జరుగనున్నాయి. హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు అక్టోబర్ 5న జరుగుతాయి. రెండు రాష్ట్రాలకు అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించబడతాయి.