సుప్రీంకోర్టులో రాహుల్ కీలక అఫిడవిట్.. నేనేతప్పు చేయలేదు, సమావేశాల్లో పాల్గొనే అవకాశమివ్వండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఇంటి పేరుపై గతంలో తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. దీనిపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో బుధవారం ప్రమాణపత్రం సమర్పించారు. ఏ తప్పు చేయనప్పుడు సారీ చెప్తే మొత్తం న్యాయ ప్రక్రియనే అవమానపరిచినట్లని రాహుల్ చెప్పుకొచ్చారు. సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే ఇవ్వాలని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల సభలో దొంగలందరి ఇంటి పేరు మోదీ అని ఎందుకు ఉంటుందని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు.
క్షమాపణలు చెప్పేంత తప్పు చేసి ఉంటే ఈ పాటికే సారీ చెప్పేవాడిని : రాహుల్ గాంధీ
విచారణ అనంతరం రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్షను సూరత్ కోర్టు విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ సుప్రీంను ఆశ్రయించారు. తాను శిక్షలు వేసేంత పెద్ద తప్పు చేయలేదని రాహుల్ తెలిపారు. క్షమాపణలు చెప్పేంత తప్పు చేసి ఉంటే ఈ పాటికే సారీ చెప్పేవాడినన్నారు. ఏ తప్పు చేయకపోయినా సారీ చెప్తే అది పెద్ద శిక్ష అవుతుందని అఫిడవిట్ లో రాసుకొచ్చారు. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించానన్నకోపంతో ఫిర్యాదుదారుడు పూర్ణేశ్ మోదీ తనను అహంకారి అన్నారని రాహుల్ స్పష్టం చేశారు. బలవంత క్షమాపణలు చెప్పించాలనుకోవడంపై రాహుల్ విస్మయం వ్యక్తం చేశారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద క్రిమినల్ నేరం మోపి సారీ చెప్పమంటున్నారన్నారు. ఇది ముమ్మాటికీ న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడమేనన్నారు.