
Rahul Gandhi: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల సంఘాన్ని (EC) లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన విమర్శలను మరింత తీవ్రతరం చేశారు. ఓట్ల వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ (BJP)తో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతోందని దేశం మొత్తం ఇప్పుడు గమనించిందని ఆయన వ్యాఖ్యానించారు. బిహార్‌లోని సాసారం నగరంలో నిర్వహించిన 'ఓటర్ అధికార్ యాత్ర' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రాహుల్ ప్రసంగించారు. బిహార్‌లో ఓటర్ల జాబితా 'ప్రత్యేక సమగ్ర సవరణ' పేరిట ఓట్ల తొలగింపు, కొత్తగా చేర్పులు వంటి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. దీనిని 'ఇండియా' కూటమి (India Bloc) అంగీకరించదని, పేదల ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ హరించనివ్వరని స్పష్టం చేశారు.
Details
అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చోరీ అవుతున్నాయి
'దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చోరీ అవుతున్నాయి. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి బలంగా రాణించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయంపై స్పష్టమైన అంచనాలు వెలువడ్డాయి. కానీ, నాలుగు నెలల్లోనే కోటి మంది ఓటర్లు కొత్తగా జాబితాలో చేరడంతో, భాజపా కూటమి గెలిచింది. ఎక్కడైతే ఓట్ల సంఖ్య పెరిగిందో అక్కడ కాషాయ పార్టీ గెలుపొందింది. ఈసీ ఏం చేస్తోందో ఇప్పుడు దేశ ప్రజలందరికీ తెలిసిందని రాహుల్ గాంధీ అన్నారు. అలాగే ఓట్ల చోరీపై తాను చేసిన ఆరోపణల విషయంలో ఎన్నికల సంఘం తన దగ్గర అఫిడవిట్ కోరిందని ఆయన తెలిపారు. అయితే బీజేపీ నేతలు కూడా ఇలాంటి వాదనలు చేసిన సందర్భంలో ఎన్నికల సంఘం ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
Details
ప్రజల ఓటు హక్కును లాక్కోవడానికి ప్రయత్నం
''భాజపా, ఆరెస్సెస్‌లు రాజ్యాంగాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నాయsని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును లాక్కోవడానికే ఈ ప్రయత్నమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం, భాజపా ప్రభుత్వానికి ఏజెంట్‌లా మారిందని వ్యాఖ్యానించారు. బిహార్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయే ప్రభుత్వాన్ని తప్పక గద్దె దించుతారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల ఓటు హక్కును కాలరాయడానికి ఎన్నికల సంఘాన్ని సర్కారు వినియోగిస్తోందని ఆయన ఆరోపించారు.