Rahul Gandhi on adani: అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్, ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లంచం ఆరోపణల నేపథ్యంలో, సెబీ చీఫ్ మాధభి పురీ బచ్‌పై కూడా విచారణ జరిపించాలని ఆయన సూచించారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో, ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన సందర్భంగా, రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమేరకు, ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విమర్శలు చేశారు. అదానీ అమెరికా, భారత చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. అదానీ,మోదీ మధ్య ఉన్న సంబంధం, దేశ భద్రతకు ప్రమాదకరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ అతనిని రక్షిస్తున్నారు: రాహుల్
తాజా ఆరోపణలపై వెంటనే జేపీసీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని తెలిపారు. రాహుల్ గాంధీ, అదానీ తన అవినీతి ద్వారా దేశ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. అదానీని అరెస్టు చేసి విచారిస్తే, అన్ని నిజాలు బయటకు వస్తాయని అన్నారు. అదానీకి మద్దతు ఇస్తున్న సెబీ చీఫ్‌ను ఆ పదవి నుంచి తొలగించి ఆమెపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విచారణ జరగాలని కోరారు. "అదానీ అరెస్టు కావడం, అతనిపై విచారణ జరగడం నాకు అనుమానం. ఎందుకంటే ప్రధాని మోదీ అతనిని రక్షిస్తున్నారు," అని రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యాఖ్యానించారు.