2024లో మరోసారి అమేథీ బరిలో దిగనున్న రాహుల్.. ప్రకటించిన యూపీ కాంగ్రెస్ చీఫ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి అమేథీ బరిలో దిగనున్నారు. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ పీసీసీ శుక్రవారం ప్రకటించింది. రాహుల్ ప్రస్తుతం వయనాడ్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో యూపీలోని అమేథితో పాటు కేరళలోని వయనాడ్ స్థానానికి పోటీ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో కేరళ నుంచి ఎంపీగా గెలిచారు. దీంతో దక్షిణాది నుంచి పార్లమెంట్ దిగువసభకు రాహుల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచే పోటీ చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్ ధృవీకరించారు. గత ఎన్నికలు 2019లో రాహుల్ పై బీజేపీ నేత, ప్రస్తుత కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పోటీ చేశారు.
తరతరాలుగా అమేథీ లోక్‌సభ నుంచి గాంధీ కుటుంబమే కొనసాగింది.
సుమారు 55,000 ఓట్ల తేడాతో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడ్ని ఓడించారు. తరతరాలుగా అమేథీ లోక్‌సభ నుంచి గాంధీ కుటుంబమే గెలుస్తూ వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై పీసీసీ చీఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రియాంక, వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేస్తే, ఆమె విజయం కోసం ప్రతి కార్యకర్త కృషిచేస్తారని రాయ్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లోనూ మోదీపై ప్రియాంక పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. చివరి క్షణంలో కాంగ్రెస్ రాయ్‌ను బరిలోకి దించింది. ఈ నేపథ్యంలోనే అజయ్ రాయ్ మోదీ చేతిలో ఓడిపోయారు. ప్రియాంక చట్టసభల్లో ఉండాలని ఇటీవలే ఆమె భర్త రాబర్ట్ వాద్రా కోరుకున్నారు. ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు.