AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 రోజులు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోతోంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాలు వర్షాలతో అల్లకల్లోలంగా మారాయి. ఇప్పటికే వచ్చిన వర్షాలతో వరదలు ఉప్పొంగి జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోగా.. తాజాగా వాతావరణ శాఖ మరోసారి రాష్ట్రం కోసం హెచ్చరికలు జారీ చేసింది. వాయుగండం ముప్పు తొలిగిందని ఊపిరి పీల్చుకున్న ప్రజలకు, బంగాళాఖాతంలో త్వరలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉందని వాతావరణ శాఖ అధికారులు తాజాగా హెచ్చరించారు. దీంతో మరోసారి ఏపీవాసులలో ఆందోళన మొదలైంది. వాతావరణ శాఖ అధికారులు దీనిపై అప్రమత్తం చేస్తున్నారు, క్రమేపీ ఈ అల్పపీడనం బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో రానున్న 24 గంటల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని సూచిస్తోంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి వంటి ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.