రానున్న రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో 17,18 తేదీల్లో వర్ష సూచన చేసింది. అల్పపీడనం కారణంగా నెలాఖరు వరకు వర్షాలు కొనసాగనున్నట్లు వెల్లడించింది. కొద్ది రోజులుగా ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు విలయతాండవం చేస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు మినహా ఇప్పటివరకు చెప్పుకోదగ్గా భారీ వర్షాలు పెద్దగా కురవకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏలూరులోని ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వానలకు కుంటలు నిండు కుండలా మారుతున్నాయి.
పిడుగులు పడే అవకాశం, అప్రమత్తంగా ఉండాలి : వాతావరణ కేంద్రం
కోనసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి.రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు రాయలసీమలోని అనేక జిల్లాల్లో రానున్న4 రోజుల్లో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్రలోని కీలక నగరం విశాఖ సహా అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.