తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం
ఐఎండీ తీపి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ,తమిళనాడు రాష్ట్రాలను తాకాయి. 48 గంటల్లో కేరళ, తమిళనాడులో విస్తరించి కర్ణాటకలోని కొన్ని భాగాలలో సైతం అవి ప్రవేశించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న 2 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు జల్లులతో కూడిన మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందిని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో వచ్చే 2 రోజులు వడగాలులు వీయనుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
రాయలసీమలో అక్కడ చల్లదనం, ఇక్కడ వేడి
హైదరాబాద్ సిటీలో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురవనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పగటిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 27 డిగ్రీలు, గరిష్ఠంగా 39 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని వివరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు వేడి నుంచి ఉపశమనం కలిగే అవకాశాలున్నాయి. ఓవైపు తేమగాలులు వీస్తుండటం, మరోవైపు రాయలసీమ జిల్లాలతో సహా కోస్తాంధ్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. అయితే కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో మాత్రం వాతావరణం చల్లగా మారనుండగా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప సహా నెల్లూరు జిల్లాల్లో ఇంకా వేడి వాతావరణమే కొనసాగనుంది.
తీరప్రాంతాలకు అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
IMD తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా తీవ్రమైన బిపర్‌జోయ్ తుపాను ప్రస్తుతం గుజరాత్ పోరుబందర్‌కు నైరుతి దిశలో సుమారు 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతుంది. ఈ తుపాను కారణంగా ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు దక్షిణాదితో సహా కోస్తా ప్రాంతాల్లో కురవనున్నట్లు భారత వాతావరణ కేంద్రం చెబుతోంది. మరోవైపు గుజరాత్, సౌరాష్ట్ర లోని అన్ని హార్బర్లలో తుపాను నేపథ్యంలో సుదూర ప్రమాద హెచ్చరిక సిగ్నల్‌ను ఎగరవేయమని ఐఎండీ నిర్దేశించింది.